Tirupati Floods: ఉద్ధృతంగా మారిన రాయల చెరువు.. సహాయక చర్యలు నిలిపివేత..

Tirupati Floods: తిరుపతిలోని రాయల చెరువు డేంజరస్‌గా మారింది.

Update: 2021-11-21 15:32 GMT

Tirupati Floods (tv5news.in)

Tirupati Floods: తిరుపతిలోని రాయల చెరువు డేంజరస్‌గా మారింది. చెరువు కట్టకు పడిన స్వల్ప గండి.. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో రానురాను పెద్దదిగా మారుతోంది. ఏక్షణమైనా గండి పడి.. ఊళ్లకు ఊళ్లను ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. చెరువు కట్ట నుంచి జారుతున్న మట్టితో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు సమీప ప్రజలు. రాయల చెరువు తెగితే అనేక పల్లెలకు ముంపు ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

గండి పడిన చోట వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు సహాయక చర్యలు నిలిపివేశారు. చేసేదేమి లేక.. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెనుదిరిగారు. వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండటంతో చెరువు చుట్టు పక్కల గ్రామాల భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. ఏక్షణం ముంపు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే కొన్ని గ్రామాలకు జలదిగ్భందమయ్యాయి.

రాయలచెరువును ప్రత్యేక అధికారి ప్రద్యుమ్నా పరిశీలించారు. మరో మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సి.రామాపురం వద్ద ఇంజనీరింగ్‌ కాలేజీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని చెరువు దిగువ ప్రాంతాలవారు తప్పనిసరిగా ఖాళీ చేయాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ అధికారుల హెచ్చరికలు తప్పక పాటించాలన్నారు. ఈ చెరువుకు 0.9 టీఎంసీల నీరు చేరిందని గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద ప్రవాహం రాలేదన్నారు.

Tags:    

Similar News