JAGAN: కోర్టుకు హాజరయ్యేందుకు జగన్ బల ప్రదర్శన
అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు జగన్.. భారీగా జన సమీకరణ చేసిన వైసీపీ నేతలు.. బేగంపేట విమానాశ్రయం వద్ద లాఠీఛార్జ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. జగన్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యే క్రమంలో ఆసక్తికర పరిణామాలు సంభవించాయి. బేగంపేట్ ఎయిర్‌పోర్టుతో పాటు కోర్టు దగ్గర హడావుడి చేయడానికి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. పెద్ద సంఖ్యలో రెండు చోట్లకు చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. పోలీసులను తోసుకుని ముందుకు రావడానికి ప్రయత్నించారు. దీంతో తోపులాట చేటుచేసుకుంది. . కొందరు రప్పా రప్పా అంటూ నినాదాలు చేశారు. ఎయిర్ పోర్టు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు సీబీఐ కోర్టు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయితే జగన్ విమానాశ్రయానికి చేరుకోగానే బారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అభిమానులు ముందుకు సాగేందుకు ప్రయత్నించడంతో పోలీసులతో తోపులాట చోటుచేసుకుంది. గుంపును నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌కి దిగడంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. పరిస్థితిని అదుపులోకి తీసుకున్న తర్వాత జగన్ బేగంపేట నుంచి నేరుగా నాంపల్లి ఏసీబీ కోర్టుకి బయలుదేరారు. కాసేపట్లో జగన్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవనున్నారు. అక్రమాస్తుల కేసులో విచారణకు ఈసారి ప్రత్యక్ష విచారణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీబీఐ కోర్టు గేట్‌ను పూర్తిగా మూసివేసి, కేవలం న్యాయవాదులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. జగన్ రాకతో నాంపల్లి పరిసరాలన్ని పోలీసులు ముట్టడి చేసి, ఉద్రిక్తతలు నివారించేందుకు అదనపు బందోబస్తు మోహరిచారు. జగన్ వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు. బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు వరకు జగన్ కు వైసీపీ నేతలు భారీగా హాజరై స్వాగతం పలికారు.