JAGAN: ఉద్రిక్తతలు, ఆందోళనల మధ్య జగన్ పర్యటన
జగన్ పర్యటన వేళ దళిత సంఘాల ధర్నా... తోపులాటలో వృద్ధురాలికి గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఓ కుట్ర అని మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన, ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణను “కుట్ర”గా వర్ణించారు. పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంగా మార్చడం ద్వారా వారిని అన్యాయానికి లోనుచేస్తారని జగన్ ఆరోపించారు. తమ పాలనలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబడిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం వల్ల పేదవారికి వైద్యం అందించడం అసాధ్యమవుతుందని, అందుకే ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి తెచ్చినట్లని పేర్కొన్నారు. నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టడం, కోవిడ్ సంక్షోభంలో రూ.500 కోట్లు ఖర్చు చేసి, ఈ మెడికల్ కాలేజీ పూర్తయిన తర్వాత 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందించనున్నట్టు జగన్ అన్నారు.
ఆంక్షలు ఉల్లంఘన
జగన్ పర్యటన నేపథ్యంలో జాతీయ రహదారిపై జనం గుమిగూడొద్దని పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, రోడ్డు మార్గంలో వెళ్తున్న జగన్‌ను కలిసేందుకు ప్రజలు, వైకాపా కార్యకర్తలు రోడ్లపైకి చేరుకుంటున్నారు. పోలీసులు విధించిన ఆంక్షలను జగన్ లెక్కచేయకుండా మార్గమధ్యంలో అక్కడక్కడా ఆగుతూ ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల అంబులెన్సులు సైతం వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.
దళిత సంఘాల ఆందోళన
జగన్ పర్యటన వేళ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. పట్టణంలోని కూడలిలో దళిత నేతలు, ఆయా సంఘాల ప్రతినిధులు మానవహారంగా ఏర్పడి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ హయాంలో మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్‌కు జరిగిన అవమానాలు, వేధింపులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ పీపీఈ కిట్ అడిగినందుకు ఆయన్ను మానసికంగా వేధించారని దళిత సంఘాలు ఆరోపించాయి. ‘ఒక దళిత మేధావికి జగన్‌రెడ్డి చేసిన సన్మానం ఇది’, ‘జగన్‌రెడ్డి ప్రభుత్వంతో పోరాడి అలసిపోయి ఆగిన దళిత గుండె’ అంటూ డాక్టర్ సుధాకర్ ఫొటోలతో ఉన్న ప్లకార్డులను దళిత నేతలు ప్రదర్శించారు. ‘జగన్ గోబ్యాక్’ అంటూ నినదించారు.