JAGAN: జమిలీ ఆశలతో జనంలోకి జగన్
కచ్చితంగా జమిలీ వస్తుందని వైసీపీ ధీమా... అందుకే పాదయాత్ర ప్రకటన చేసిన జగన్..! 2027లో జమిలీ వస్తుందన్న నమ్మకంతో వైసీపీ;
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత చాలామంది కీలక నేతలు వైసీపీని వీడారు. జగన్ కూడా పార్టీ పనులను కాస్త పక్కన పెట్టడంతో వైసీపీ పనైపోయిందని చాలామంది భావించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ సీట్లకు పరిమితమైన వైసీపీ...ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది. అంత ఓటమిలో కూడా… 40 శాతం వరకూ ఓట్లు పడ్డ విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఆ ఓట్ బ్యాంక్‌ని కాపాడుకుంటూ…. సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలిగితే…. మళ్ళీ పవర్లోకి రావడం ఖాయమని లెక్కలేసుకుంటోందట పార్టీ అధిష్టానం. అదే సమయంలో… జమిలి ఎన్నికల గురించి కూడా వైసీపీలో సీరియస్‌గా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఖచ్చితంగా జమిలి వస్తుందన్న నమ్మకంతో కార్యక్రమాలను డిజైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో సంబంధం ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే… పార్టీ అధ్యక్షుడు జగన్ ఇటీవల యాక్టివిటీ బాగా పెంచారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆందోళనలు నిర్వహిస్తోంది పార్టీ. మిర్చి, పొగాకు రైతుల కోసం గుంటూరు, పొదిలి పర్యటనలు, వివిధ సందర్భాల్లో అరెస్ట్ అయిన వారికి పరామర్శల్లాంటివన్నీ ఇందులో భాగమేనంటున్నారు.
ఆశగా వైసీపీ..
ఏపీలో ప్రస్తుతం మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిల్లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమిలో బీజేపీ ఉన్నా.. ఓట్లు, సీట్లు మాత్రం ఈ రెండు పార్టీల కంటే తక్కువే. మరోవైపు వైసీపీ ఉంది. వైసీపీ సింగిల్ పోటీ చేసి 2019లో ఘనవిజయం సాధించింది. 2024లో మాత్రం ఊహించని స్థాయిలో పరాజయం పాలైంది. ఓటమి తర్వాత కొన్నిరోజులు కామ్‌గా ఉన్న వైసీపీ నేతలు.. ఇటీవల యాక్టివ్ అయ్యారు. జమిలి ప్రకటనలపై ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య జగన్ జమిలి ఎన్నికలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్న సమయంలో జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. జమిలి ఎన్నికలు జరిగితే.. వైసీపీకే లాభం అని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు.