ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు ఎప్పట్లాగే వైసీపీ అధినేత జగన్ సహా మిగిలిన ఎమ్మెల్యేలు వెళ్లలేదు. అయితే అసెంబ్లీకి వెళ్లకపోవడంపై తాజాగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. '' అసెంబ్లీకి వెళ్లొద్దని నేను ఎవరికీ చెప్పలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సమయం ఇస్తామని క్లారిటీ ఇవ్వొచ్చు. అసెంబ్లీకి వెళ్లలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తామని'' జగన్ అన్నారు. జగన్ పార్టీ శాసనసభాపక్ష భేటీలో అసెంబ్లీకి వెళ్లకపోవడంపై మాట్లాడారు. అసెంబ్లీకి రావాలంటే ఒక కండిషన్ ఉందని చెప్పారు. సభలో మాట్లాడేందుకు తగినంత టైమ్ ఇస్తే సభకొస్తానని తెలిపారు. ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు కొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఇస్తే నేనేం మాట్లాడాలంటూ ప్రశ్నించారు.
మారని జగన్.. వైసీపీ నేతల్లో నైరాశ్యం
వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు మారడంలేదు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా.. ఆయన మాత్రం వరుసగా బెంగళూరు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నెల 1 వరకు అక్కడే ఉండి వచ్చారు. నేడు మరోసారి బెంగుళూరు వెళ్తున్నారు. దీంతో వైసీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోయినా.. కనీసం తాడేపల్లిలో ఉండి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తే బాగుండేదని సొంత నేతలే పెదవి విరుస్తున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే, సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తే సభకు వస్తానని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ తెలిపారు. ఎమ్మెల్యేలతో సమావేశంలో మాట్లాడుతూ, కొన్ని నిమిషాల సమయంతో ప్రజా సమస్యలను వివరించడం సాధ్యం కాదన్నారు. సభలో సమయం కరువవుతుందని, అందుకే ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా నిరాకరణపై కోర్టులో కేసు వేసినట్టు ఆయన గుర్తుచేశారు.