JAGAN: జగన్ కంచుకోట బద్దలవుతుందా..?
ప్రారంభమైన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్;
వైఎస్ కుటుంబ కంచుకోటలో జరిగిన ఉప ఎన్నికలు.. శాసన ఎన్నికలను తలపించాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ కంచుకోటగా ఉన్న స్థానాలను కైవసం చేసుకోవాలని కూటమి పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. జరిగిన, జరుగుతున్న పరిణామాలు.. వైసీపీ నేతల ఆరోపణలు చూస్తుంటే జగన్ కంచుకోట బద్దలైనట్లే కనిపిస్తోంది. అక్రమాలు జరిగాయంటూ వైసీపీ పెడుతున్న గగ్గోలు చూస్తుంటే వారు అనధికాారికంగా ఓటమిని అంగీకరించినట్లే కనిపిస్తోంది. పోలీసుల కుమ్మక్కుతో చంద్రబాబు ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని.. కేంద్ర బలగాలతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న జగన్ డిమాండ్ తో వైసీపీ పూర్తిగా చేతులు ఎత్తేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఇటీవల కడప జిల్లాలో మహానాడుకార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించింది. ఇది అక్కడి రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తరువాత ఎన్నో నగరాల్లో మహానాడు జరిగింది. కానీ ఇప్పటివరకు కడప జిల్లాలో ఎప్పుడూ ఈ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు జరగలేదు. ఆ లోటును ఈసారి అధిగమించి, రాయలసీమలో ముఖ్యంగా వైఎస్ కడప జిల్లాలో తాము బలంగా ఉన్నామని తెలుగుదేశంఘనంగా చూపించింది. గతంలో విభజన తర్వాత రాష్ట్రంలో టీడీపీ ఎన్నడూ గెలవని సీట్లను సాధించి చూపిన నేపథ్యంలో కడప వంటి వైసీపీ గడపను టార్గెట్ చేయడం వెనుక బలమైన వ్యూహమే ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీమలో పర్యటనలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సైతం తరచూ సీమ జిల్లాల్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడే దృష్టి పెట్టడం వల్ల రాయలసీమ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమ బలాన్ని తిరిగి నిరూపించుకోవాలంటే వైసీపీ మరింత కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నుంచి రాయలసీమ వైపు దృష్టి పెట్టే పార్టీల మధ్య కచ్చితంగా గట్టి పోటీ తప్పదన్నది స్పష్టంగా కనిపిస్తోంది.