PAWAN: సవాల్ చేసిన తొడల్ని బద్దలు కొట్టాం
దేశాన్ని మా వైపు చూసేలా చేశాం... ఆవిర్భావ సభలో గర్జించిన జనసేనాని పవన్ కల్యాణ్;
ఏపీ శాసనసభ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించి దేశాన్ని మన వైపు చూసేలా చేశామని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 2019లో మనం ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారని.. జబ్బలు చరిచారని పవన్ గుర్తు చేశారు. జనసేన ఆడపడుచుల్ని అవమానించారని.. ప్రజల్ని ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కూడా జైల్లో పెట్టి వైసీపీ ప్రభుత్వం వేధించిందని పవన్ మండిపడ్డారు. పిఠాపురంలో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో అశేషంగా తరలివచ్చిన జనసైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పదకొండేళ్ల జనసేన ప్రస్థానాన్ని, ఎన్ని కష్టాలు ఎదుర్కొని, పార్టీని ఎలా నిలబెట్టిందీ వివరించారు.
భయమన్నది లేనే లేదు: పవన్
తొలుత తమిళంలో ప్రసంగం మొదలుపెట్టారు. భయం లేదు.. భయం లేదు.. భయమన్నది లేనే లేదు అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 12వ ఆవిర్భావ సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్ని ఒక్కన్నే అయి... 2014లో జనసేన పార్టీని స్థాపించానని గుర్తు చేశారు. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా.. అడుగు ముందుకే వేశామని పవన్ అన్నారు. "మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం.. మనం నిలదొక్కుకున్నాం.. టీడీపీని నిలబెట్టాం " అని పవన్ అన్నారు. దారంతా గోతులు గుంతలు, లోయలు అగాధాలున్నా.. ఇళ్లేమో దూరమైనా... చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాడిని గనుకే.. అన్నీ ఒక్కడినే అయి.. 2014లో జనసేన స్థాపించానని పవన్ అన్నారు. ఓటమి భయం లేదు కాబట్టి 2019లో పోటీ చేశామని... ఓడినా అడుగు ముందుకే వేశామన్నారు. మనం నిలబడ్డాం. పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం.. నిలదొక్కుకోవడమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని నిలబెట్టామని తెలిపారు.
జనసేన జన్మస్థలం తెలంగాణ
జనసేన పార్టీ జన్మస్థలం తెలంగాణ ప్రాంతమని... కర్మ స్థానం ఆంధ్రప్రదేశ్ అని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ పర్యటనలో కరెంట్ షాక్ కొట్టినా.. కొండగట్టు అంజన్న కాపాడాడని గుర్తు చేసుకున్నారు. దాశరథి సాహిత్యం చదివి తాను ప్రభావితం అయ్యానని పవన్ తెలిపారు. దాష్టీక ప్రభుత్వాన్ని దించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. రుద్ర వీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తా అనే మాటలు నిజం చేశామని పవన్ అన్నారు.