నిస్వార్ధంగా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు, భవిష్యత్తులో బలమైన నాయకత్వం అందించడానికి, నిరంతరం పార్టీ కోసం పనిచేసే వారికి భద్రత అందించడానికి ‘త్రిశూల్ వ్యూహం’ రూపొందిస్తున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వ్యూహం దసరా నుంచి అమలు చేయబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యూహం ద్వారా జనసేన పార్టీకి ఒక కొత్త అధ్యాయం మొదలు అవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. . విశాఖలో నిర్వహించిన ‘సేనతో సేనాని’ సభలో ఆయన మాట్లాడారు. ఈ 11 ఏళ్ల ప్రయాణంలో కుటుంబం, సినిమాల కంటే జనసేన పార్టీపైనే ఎక్కువ దృష్టిపెట్టానని తెలిపారు. అందుకే వందశాతం స్ట్రైక్ రేట్‌తో దేశంలోనే చరిత్ర సృష్టించామన్నారు. తగిలిన ఎదురు దెబ్బలు మరింత రాటుదేల్చాయి.. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాం కాబట్టే ప్రజలకు మేలు చేస్తున్నామని తెలిపారు. వీరమహిళల సేవలను ఎప్పటికీ మరచిపోలేమన్నారు. ఏ సిద్ధాంతాలు, నిబద్ధతతో వచ్చామో ఇప్పటికే అలాగే ఉన్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి సభకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
దశాబ్ద కాలం పాటు పార్టీ నడిపాను అని, జనసేన పెట్టిన తరవాత కుటుంబాన్ని విస్మరించానని, సినిమాలపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయానన్నారు. ఏరోజు కూడా పార్టీని, జనసైనికులను, వీరమహిళలను విడిచిపెట్టలేదని పేర్కొన్నారు. పార్టీ పెట్టినప్పుడు 150 మంది మాత్రమే తన వెంట ఉన్నారని.. ఈరోజు 18 వేల మంది క్రియాశీలక వాలంటీర్లు, 12 లక్షల మంది జనసేన క్రియాశీలక సభ్యులుగా జనసేన ఎదిగిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఒక్క ఓటమితో నత్త గుల్లలు రాలిపోయాయి. నిజమైన బలమైన నాయకులు నా వెంట నిలబడ్డారు’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.
మార్పు అవసరం
ప్రజల ఆకాంక్షలకు సమాధానం ఇచ్చే విధంగా కొత్త నాయకులను తయారు చేసేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, సైద్ధాంతిక శిబిరాలు ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయాల్లో కులం, మతం, ప్రాంతం లేదా రంగు వంటి అంశాల ఆధారంగా లబ్ధి పొందే పరిస్థితులు ఉండకూడదు. కులం కోసం ప్రయాణం సాగిస్తే కుల నాయకుడిగా మాత్రమే పరిమితమవుతాను. నేను జాషువా విశ్వనరుడు స్ఫూర్తితో, సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. "సర్వ స్ధాయిల నుండి, గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగాలన్నది నా లక్ష్యం. ప్రతి క్రియాశీల కార్యకర్త ప్రత్యేక మెంబర్షిప్ ఐడీతో పటిష్టమైన వ్యవస్థలో భాగస్వామ్యమవుతారు. నాయకత్వం పదవి కాదు, అది సేవ ద్వారా, పోరాటంతో సంపాదించే గౌరవం." క్రియాశీల కార్యకర్తలను, సరిగా శిక్షణ ఇచ్చి సేవా భావంతో ముందుకు వచ్చినవారే నాయకులు అవుతారు" అని అన్నారు.
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలలో జనసేన పార్టీని విస్తరించండని అంటున్నారని.. తాను విస్తరించాలి అంటే ముందు మీరు పోరాటం చేయండి అని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మీకు అండగా సైద్ధాంతిక బలం తాను ఇస్తాను అని, మీరు బలోపేతం చేస్తే ఖచ్చితంగా ఒకరోజున జనసేన జాతీయ పార్టీగా ఎదుగుతుందన్నారు. తాను ఒకరోజు జనసేన జాతీయ పార్టీ అవుతుంది అంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు.. కానీ ఖచ్చితంగా ప్రజలు అందరూ కలిసి వస్తే అది నిజం అవుతుందని పవన్ చెప్పారు. తాను అన్ని వర్గాలకు న్యాయం చేయాలని పరితపించే వ్యక్తిని అని పవన్ చెప్పుకొచ్చారు.