Tirupati : తిరుపతి తొక్కిసలాటపై న్యాయవిచారణ
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ కమిషన్;
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ల జారీ క్యూలైన్‌లో ఆరుగురు మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 8వ తేదీన జరిగిన ఈ సంఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి అప్పుడే ప్రకటించారు. దాని ప్రకారం ఇప్పుడు మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. తిరుపతిలోని పద్మావతి పార్క్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టోకెన్ల కోసం ఎదురుచూస్తున్న ఆరుగురు భక్తులు మరణించడానికి దారి తీసిన పరిస్థితులేమిటో కమిషన్ విచారణ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. న్యాయ విచారణ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది.