Kadapa Floods: దయనీయ స్థితిలో కడప.. వరదలో పోయిన ప్రాణాలకు లెక్కేలేదు..
Kadapa Floods: ఏపీలో కడప జిల్లాను జలఖడ్గం కబళించింది.;
Kadapa Floods (tv5news.in)
Kadapa Floods: ఏపీలో కడప జిల్లాను జలఖడ్గం కబళించింది. అన్నమయ్య, ఫించా ప్రాజెక్టులు తెగిపోవడంతో.. వందలాది మంది గల్లంతయ్యారు. 15 గ్రామాలను వరదలు చుట్టుముట్టాయి. వరదలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు నేవి రంగంలో దిగింది. హెలికాఫ్ట్ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజంపేట మండలం రామాపురం వద్ద 17 మృతదేహాలను వెలికితీసారు. మరోవైపు కడప తిరుపతి రహదారిపై మరో పదిమంది గల్లంతయ్యారు.
రాజంపేట మండలం నందలూరు వెళుతున్న మూడు ఆర్టీసీ బస్సులు.. వరదనీటిలో చిక్కుకు పోయాయి. నందలూరు సమీపంలో ఉదయం నుంచి వరదలోనే ఉన్న ఆర్టీసీ బస్సుల్లోని సిబ్బంది, కొందరు ప్రయాణికులు.. ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయారు. నందలూరు పరివాహక ప్రాంతాల్లోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతాల్లో 3 ఆర్టీసీ బస్సులు వరద ఉద్ధృతిలో చిక్కుకుని కొట్టుకుని పోయిన ఘటనలో 30 మంది గల్లంతయ్యారు.
వీరిలో ఇప్పటి వరకు 17 మంది మృత దేహాలు లభ్యమయయ్యాయి. ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టిన సహాయక సిబ్బంది, అధికారులు మృతదేహాలను వెలికి తీశారు. గండ్లూరులో 7, రాయవరంలో 3, మండపల్లిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒకరిని ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన కండక్టర్ అహోబిలం, చిట్వేలికి చెందిన శ్రీనుగా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సుల్లోని కొందరిని మాత్రం అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది
వరద ఉద్ధృతిలో బస్సులు కొట్టుకుపోయిన ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 30 మంది కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు స్థానికులు. చెయ్యేరు నది నుంచి పోటెత్తుతున్న ప్రవాహం నందలూరు, రాజంపేట తదితర గ్రామాలను ముంచెత్తుతోంది. వరద ఉద్ధృతి వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు
మరోవైపు.. రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల పరిధిలోని చెయ్యేరు నది పరివాహక ప్రాంతంలో 7 శివాలయాలున్నాయి. ఇవాళ శుక్రవారం కావడం అందులోనూ కార్తీక పౌర్ణమి రావడంతో.. ఈ శివాలయాలకు పెద్దసంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడం వల్ల చెయ్యేరు నది ప్రవాహంతో ఉగ్రరూపం దాల్చింది.ఈ వరదలు ఈ 7 శివాలయాలు ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ సమయంలో భక్తులు వుంటే వారంతా ఎక్కడ ఉన్నారన్నది సస్పెన్స్‌గా మారింది. వీరంతా తప్పించుకున్నారా? లేక గల్లంతయ్యారా? అన్నది తెలియాలి.