కాకినాడ: వైసీపీ టిక్కెట్టు నిరాకరించిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ పార్టీ అధిష్టానానికి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజా దీవెన పేరుత్ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మొదటి విడతగా వైసీపీ ప్రకటించిన ఇన్చార్జీల జాబితాలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కు చోటు దక్కలేదు.
ప్రసాద్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి అవకాశం ఇస్తూ ఇన్చార్జీగా ప్రకటించారు. ఇటీవల కాకినాడ పర్యటనలో సీఎం జగన్మోహనరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ప్రసాద్, టికెట్ ఇవ్వకపోయినా అసంతృప్తి లేదని, వచ్చే ఎన్నికల్లో పార్టీకి కష్టపడి పనిచేస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ అధిష్టానం మూడు జాబితాలు ప్రకటించిన నేపథ్యంలో టిక్కెట్టు దక్కని అసంతృప్తులు బయట పడుతుండటంతో, వారి బాటనే ప్రసాద్ అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కి షాక్ ఇస్తూ తిరుగుబాటుకు సిద్దమయ్యారు. .
ఈ సందర్భంగా ఆయన యాత్రతో తన పనితీరు, కొత్త ఇన్‌చార్జ్ పనితీరును సీఎం బేరీజు వేసుకుంటారని వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేవిధంగా భవిషత్తులో తీసుకునే నిర్ణయానికి ప్రజల దీవెనలు కోరనున్నట్టు ఆయన వివరించారు. ఇప్పటికే ఇన్‌చార్జిని మార్చినా.. తనను కాదని వేరొకరికి టికెట్ ఇస్తారని అనుకోవడం లేదని పర్వత ప్రసాద్ నమ్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.