హిందూ ఆలయాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయి : కమలానంద భారతి
రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు పెరిగిపోతున్నాయని విజయవాడ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి విమర్శించారు.;
రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు పెరిగిపోతున్నాయని విజయవాడ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి విమర్శించారు. రాజమండ్రి శ్రీరామనగర్‌లో దాడికి గురైన సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. అంతర్గతంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని అసాంఘిక శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. సమాజం అంతా కలిసి ఇలాంటి శక్తులను ఎదురుకోవాలని అన్నారు కమలానంద భారతి.
ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. రామతీర్థం ఘటనపై ప్రభుత్వం స్పందించిన తర్వాత కూడా రెండు చోట్ల ఇలాంటి ఘటనలే వెలుగు చూడటం హిందూ భక్తుల్లో ఆందోళన పెంచుతోంది. విశాఖ మన్యంలో దుండగులు దుర్మార్గానికి తెగబడ్డారు. పాడేరు ఘాట్‌లోని కోమాలమ్మ అమ్మవారి పాదాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
అటు రాజమండ్రిలో సుబ్రహ్మణ్యస్వామి చేతులు ధ్వంసం చేసిన ఘటన జరిగిన కొద్ది గంటలకే విశాఖలో ఇలాంటి ఘటనే వెలుగు చూడటం కలకలం రేపుతోంది. వరుస ఘటనలతో హిందువుల్లో ఆందోళన పెరిగిపోతోంది. దాడులను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.