KAVITHA: పవన్ కల్యాణ్‌పై కవిత తీవ్ర విమర్శలు
పవన్ సీరియస్ పొలిటీషియన్ కాదన్న కవిత... భగ్గుమన్న జనసేన శ్రేణులు;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె డిప్యూటీ సీఎంని ఏకిపారేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చిచ్చు రేపుతున్నాయి. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారని అడిగిన ఓ ప్రశ్నకు కవిత సమాధానమిస్తూ.. 'దురదృష్టవశాత్తూ ఆయన ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఏపీలో వైసీపీ మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ నిజానికి సీరియస్ పొలిటీషియన్ కాదని వ్యాఖ్యానించారు.పవన్ మాటలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న కవిత.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు.
కవిత ఏమన్నారంటే..?
‘ఆయనను సీరియస్‌గా తీసుకోను... అనుకోకుండా పొరుగు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. రాజకీయాల్లో ఆయన చేసిన ప్రతీది ప్రశ్నార్థకంగానే నిలుస్తుంది. చేగువేరాను ఇష్టపడే వ్యక్తి కంప్లీట్ రైటిస్ట్‌గా ఎలా మారడానేది నాకు తెలియడం లేదు. ఆయన చేసే రాజకీయ వ్యాఖ్యలు కూడా ఆయనకు ఆయనే విభేధించుకునేలా ఉంటాయి. ఇప్పుడు ఇలా మాట్లాడే పవన్ కల్యాణ్... రేపు తమిళనాడు వెళ్తే హిందీ అమలు చేయడానికి వీల్లేదని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నేను స్పందించాలని అనుకోవడం లేదు. ఆయన సీరియస్ పొలిటీషియన్ అని భావించడం లేదు’’ అని కవిత పేర్కొన్నారు.
భగ్గుమన్న జనసేన
కవిత వ్యాఖ్యలపై జనసేన, బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఆమెను హిందూ వ్యతిరేకిగా ముద్రవేస్తూ విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శించే నైతిక హక్కు బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు లేదని జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. గురువారం తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. హిందీ భాష జాతీయ భాషగా అందరికీ తెలిసిందే అని, జాతీయభాషను గౌరవించాలని డిప్యూటీ సీఎం చెప్పారని అన్నారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఎమ్మెల్సీ కవిత తాను కూడా ఏదో ఒక విమర్శ చేసి పత్రికలకు ఎక్కాలనే తాపత్రయంతో పవన్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు.