Kuppam Elections: కుప్పంలో దొంగ ఓటర్లు.. ఆరోపిస్తున్న టీడీపీ..
Kuppam Elections: కుప్పంలో దొంగ ఓటర్ల దండయాత్ర మొదలైంది.;
Kuppam (tv5news.in)
Kuppam Elections: కుప్పంలో దొంగ ఓటర్ల దండయాత్ర మొదలైంది. వేలమంది దొంగ ఓటర్లు తమ తమ పొజిషన్లలోకి వెళ్లిపోయారు. కుప్పంతో సంబంధం లేని వాళ్లంతా రాత్రికి రాత్రే వాలిపోయారు. ప్రత్యేక బస్సులు, కార్లల్లో కుప్పం చేరుకున్న వాళ్లంతా.. తమకు కేటాయించిన స్థావరాల్లో రాత్రి బస చేశారు. కుప్పంలోని విజయవాణి స్కూల్, KADA ఆఫీస్ బిల్డింగ్, CLRC బిల్డింగ్, NAAC బిల్డింగ్‌లలో దొంగ ఓటర్లకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
వీళ్లంతా విడతల వారీగా క్యూలైన్లలోకి చేరుతున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. కొంతమంది స్థానిక అధికారులు, పోలీసు యంత్రాంగం సపోర్టుతో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసేందుకు తెగబడుతున్నారంటూ చెబుతోంది టీడీపీ. నిన్నటి నుంచి కుప్పంలోకి దొంగ ఓటర్లు వస్తున్నప్పటికీ.. పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనేది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. బస్సుల్లో దొంగ ఓటర్లు దించుతున్న ఘటనలను విజువల్స్‌తో సహా బయటపెట్టినా.. పోలీసులు ఏ ఒక్కరినీ అదుపులోకి తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం అని చెబుతున్నారు.
బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో కుప్పంలో ప్రవేశిస్తున్న వారిని నిలిపి.. ఎక్కడి నుంచి వస్తున్నారని కనీసం ప్రశ్నించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే దొంగ ఓట్ల దండయాత్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద టీడీపీ ఏజెంట్లు ఉండకుండా రాత్రికి రాత్రే వారిని అరెస్ట్ చేయించారని చెబుతున్నారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్లు ఉంటే.. ఎవరు స్థానికులో, ఎవరు బయటి వ్యక్తుల్లో ఈజీగా తెలిసిపోతుంది. ఆ అవకాశం లేకుండా మాస్కులు పెట్టుకోలేదన్న కారణాన్ని చూసి, వారిపై కేసు బుక్ చేసి, పోలింగ్ కేంద్రానికి రానివ్వడం లేదంటున్నారు టీడీపీ నేతలు.
విజయవాణి స్కూల్, KADA ఆఫీస్ బిల్డింగ్, CLRC బిల్డింగ్, NAAC బిల్డింగ్‌లలో దొంగ ఓటర్లు ఉన్నారని టీడీపీ నేతలు పదే పదే చెబుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు పోలీసులు కనీసం ఎంక్వైరీకి కూడా వెళ్లలేదంటోంది టీడీపీ. పోలీసులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, దొంగ ఓటర్లకు పరోక్షంగా సాయం అందిస్తున్నారని టీడీపీ విరుచుకుపడుతోంది.