KURNOOL ACCIDENT: బైకర్ మద్యం మత్తు వల్లే పెను ప్రమాదం
కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త కోణం.. మద్యం మత్తులో తూగిన శివశంకర్.. మత్తులోనే బైక్ నడిపి డివైడర్ కు ఢీ
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వీ కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురికావడానికి బైకర్ శివశంకర్ ఆఖరి వీడియో లభ్యమైంది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు అతను ఒక పెట్రోల్ బంక్ కు వెళ్లాడు. ఆ సమయంలో శివశంకర్ తో మరో యువకుడు కూడా ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ పెట్రోల్ పోయించుకోకుండా.. శివశంకర్ ఒక్కడే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పెట్రోల్ బంక్ నుంచి వెళ్లే క్రమంలో బైక్ తో విన్యాసాలు చేశాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న శివశంకర్.. పెట్రోల్ బంక్ నుంచి వెళ్తుండగా.. అక్కడే బైక్ స్కిడ్ అయింది. బైక్ ప్రమాదానికి గురైన ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ పెట్రోల్ బంక్ ఉంది. సీసీటీవీలో రికార్డైన సమయం 24 తేదీ 2.23 గంటలుగా ఉంది. 3 గంటల తర్వాత శివశంకర్ బస్సు ప్రమాదానికి గురై మరణించాడు. తాగిన మత్తులో ఉన్న శివశంకర్.. జాతీయరహదారిపై బైక్‌తో డివైడర్‌ను ఢీకొట్టి పడిపోయి మరణించాడు. నల్లరంగు పల్సర్ బైక్ అక్కడే పడిపోయింది. దాన్ని ఒక బస్సు ఢీకొట్టింది. తర్వాత వి.కావేరి బస్సు బైక్ మీదుగా వెళ్లడంతో.. అది బస్సు కింద ఇరుక్కుపోయింది. 200 మీటర్లు అలాగే ఈడ్చుకెళ్లడంతో రాపిడికి నిప్పురవ్వలు వచ్చి బస్సు మొత్తం కాలిపోయింది.
డివైడర్ ను ఢీ కొట్టి మృతి
పెట్రోల్ బంకులోకి బైక్ వచ్చేటప్పుడు దానిపై శివశంకర్‌తో పాటు మరో యువకుడు కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీల్లో కనపడింది. దీంతో ఆ యువకుడి గురించి పోలీసులు విచారణ చేయగా అతను తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఎలియాస్ నాని అని తేలింది. పోలీసులు శనివారం అతన్ని విచారించగా.. పలు కీలక విషయాలు వెల్లడించాడు.పెట్రోలు పోయించుకున్నాక శివశంకర్ మద్యం మత్తులోనే ఎర్రిస్వామిని ఎక్కించుకుని బయల్దేరాడు. పల్సర్ వాహనం హెడ్‌లైట్ పనిచేయకపోవడంతో బ్లింకర్ వేసుకుని ముందుకెళ్లాడు. ఇష్టారాజ్యంగా వాహనం నడిపి జాతీయరహదారిపై డివైడర్‌ను వేగంగా ఢీకొట్టాడని ఎర్రిస్వామి పోలీసులకు తెలిపాడు. శివశంకర్ తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోగా తాను పక్కకు లాగి చూస్తే అతను చనిపోయినట్లు నిర్ధారణ అయ్యిందని వివరించాడు. ఆ ప్రమాదంలో తానూ పడటంతో స్వల్ప గాయాలయ్యాయని చెప్పాడు. రోడ్డుకు అడ్డంగా పడున్న వాహనాన్ని పక్కకు లాగుదామని అనుకునేలోపే ఓ బస్సు దాన్ని ఢీకొట్టిందని, తర్వాత వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి దాన్ని ఈడ్చుకుంటూ వెళ్లిందని, దాంతో మంటలు చెలరేగాయని వివరించాడు.