MLA Kalava : రాయదుర్గాన్ని అభివృద్ధి చేద్దాం తగిన సూచనలు ఇవ్వండి : ఎమ్మెల్యే కాలవ
రాబోయే 20 ఏళ్లలో రాయదుర్గాన్ని ఎలా చూసుకోవాలని పట్టణ వాసులు భావిస్తున్నారో ఆ విధంగా అందమైన, సౌకర్యవంతమైన మాస్టర్ ప్లాన్ తయారీలో సూచనలు ఇవ్వాలని రాయదుర్గం పట్టణవాసులకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గం పట్టణంలోని శ్రీ సీతారామకళ్యాణ మంటపంలో జరిగిన సమావేశం జరిగిన పురపాలక సంఘం సమావేశంలో డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ గురించి ఆయన వివరించారు. తరాల మధ్య ఆలోచన విధానంలో మార్పులు అనివార్యమని పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణాన్ని భావితరాలు ఏ విధంగా చూడాలని భావిస్తున్నాయో అందుకు అనుగుణంగా రూపకల్పన జరగాలన్నారు. 2014 _19 మధ్య జరిగిన ప్రధాన రహదారుల విస్తరణ పనులను పట్టణవాసులు మెచ్చుకున్నారని సూచించారు. అదేవిధంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏ ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టాలన్న అంశాలపై నమూనా ప్రతిపాదన సిద్ధం చేయించడం జరిగిందన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు రాయదుర్గం పట్టణ అభివృద్ధికి ఓ సమగ్ర ప్రాథమిక నివేదిక తయారుచేసి పంపిందన్నారు. ఏ ఏ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, ఏ మేరకు చేపట్టాలి.? పట్టణంలో నివాస, వాణిజ్య, పరిశ్రమలకు అనువైన ప్రాంతాలేవీ..? అన్నది విభజించడం జరిగిందన్నారు. పట్టణాన్ని అందంగా, సౌకర్యంగా తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన ప్రణాళిక ఇందులో రూపొందించడం జరిగిందన్నారు. ఇది కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనని, ఇందులో పేర్కొన్న అంశాల్లో మన పట్టణ అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చన్నారు. వీటి అమలులో కొందరికి ఇబ్బంది తలెత్తినా... చాలామందికి ప్రయోజనం చేకూర్చేలా ఉంటే తప్పక పరిగణలోకి తీసుకోటానికి వీలుందన్నారు. పట్టణ వాసులు ఇందులోని ఒక్కో అంశాన్ని పరిశీలించి అవసరమైన సూచనలు సలహాలు ప్రతిపాదించాలని కాలవ కోరారు.