LOCAL WAR: పోలింగ్ జరుతుండగా.. హెడ్ కానిస్టేబుల్‌కు గుండెపోటు
కొనసాగుతున్న సర్పంచ్ ఎన్నికల పోలింగ్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ కట్టటంతో 9 గంటలకు 19.58 శాతం పోలింగ్ నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 28.87 శాతం పోలింగ్ కాగా.. అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో 7.85 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ జరగనుండటంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల పోలింగ్ కేంద్రంలో డ్యూటీలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ యాదగిరికి ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. వెంటనే అక్కడున్న పోలీసులు సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. తరువాత సూర్యాపేటలోని ఆసుపత్రికి తరలించారు.
బీఅరఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ
నల్గొండ జిల్లా కొర్లపహాడ్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి నిప్పు
పంచాయతీ ఎన్నికల వేళ.. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం కొండవనమాల గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త సింగాల వెంకటేశ్వర్లు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అయితే, కుటుంబ సభ్యులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజకీయ కక్షల కారణంగానే నిప్పుపెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.