LOKESH: కసి, పట్టుదలతో ఎవరెస్ట్ అధిరోహించండి: లోకేశ్
నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ప్రారంభించిన లోకేశ్
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 21 మంది విద్యార్థుల బృందం ఈ నెల ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు 16 రోజుల పాటు ఈ సాహసయాత్ర చేయనుంది. 5,364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను ప్రభుత్వ విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అధిరోహించనున్నారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు, వారిలోని ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల బృందం ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారని నారా లోకేశ్ తెలిపారు. సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఏటా ఇలాంటి ప్రతిభావంతులను గుర్తించి, వారిని అన్నివిధాలా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సమగ్ర శిక్షా విభాగం ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఈ సాహస యాత్రకు సిద్ధం చేశామని తెలిపారు.