CBN: మహిళా రిజర్వేషన్ బిల్లు.. పార్టీల అధ్యక్షులకు చంద్రబాబు లేఖ
మహిళలను గౌరవించాలని చంద్రబాబు పిలుపు
రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ‘నారీ శక్తి వందన్’కు పార్లమెంట్లో మద్దతు తెలపాలని లేఖలో కోరారు. జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, వైకాపా అధ్యక్షుడు జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులకు సీఎం లేఖలు రాశారు. ‘‘మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని సంకల్పాన్ని బలపరుద్దాం. బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16వ తేదీ భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టం. నారీ శక్తి వందన్ అధినియం మహిళా సాధికారతకు, దేశ ఉన్నతికి దోహదపడుతుంది. ప్రభుత్వం, పరిపాలన, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి. అప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం’’ అని సీఎం పేర్కొన్నారు.
ఈ యుగం మహిళలదే: మోదీ
21 శతాబ్దంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయాలలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రధానమైనదని ప్రధాని మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. ఏప్రిల్ 16న పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రానుందని తెలిపారు. 21 వ శతాబ్దం మహిళలదేనని మహిళా సాధికారిత దిశగా ముందుకెళ్తున్నామన్నారు. మహిళ సాధికారిత దిశగా అడుగువేస్తున్నామని దేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళల రిజర్వేషన్ బిల్లు అతిపెద్ద నిర్ణయమని తెలిపారు. కేంద్రం తీసుకునే ఈ కీలక నిర్ణయాన్ని మహిళలకే అంకితం చేయబోతున్నామన్నారు. 2023 నుంచి ఈ బిల్లుకు అన్ని పక్షాలు మద్దతిస్తున్నాయని కొత్త చరిత్రను లిఖించేందుకు పార్లమెంటు సిద్ధంగా ఉందని అందుకోసమే మహిళల రిజర్వేషన్ల కోసం పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం అవుతుందని మోదీ అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకు వస్తుందని ప్రతి పార్టీ దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దేశాభివృద్దిలో మహిళలదే కీలకపాత్రన్నారు.