LOKESH: ## నేతలు ఇంట్లో పడుకోవద్దు: లోకేశ్
టీడీపీ, జనసేన నేతలకు దిశానిర్దేశం
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నారా లోకేశ్.. టీడీపీ, జనసేన నేతలకు దిశానిర్దేశం చేశారు. అలిగి విడివిడిగా ఉండడం కంటే కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీ బలోపేతం అందరి బాధ్యతేనని, చిన్నచిన్న సమస్యలైతే వెంటనే చర్చించి తీర్చుకోవాలన్నారు. అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమేనన్నారు. పవవ్ చెప్పినట్లుగా రాబోయే 15 ఏళ్లు అంతా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.
విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేశ్ అన్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత తీసుకొచ్చామని చెప్పారు. ‘‘ సమాజం మనకెంతో ఇచ్చింది ‘బడి’ ద్వారా ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. తరగతి గది నుంచే దేశ భవితను మార్చవచ్చని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలి. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసి పని చేయాలి. రాష్ట్రంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. దీనికోసం విద్యా విధానం మెరుగవడం అత్యంత అవసరం. విద్యా విలువలను పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచనాలు ఇప్పించాం. తల్లికి చెప్పలేని పనిని ఎప్పుడూ చేయకూడదని చాగంటి చెప్పారు. పిల్లలతో మాక్ అసెంబ్లీ నిర్వహించాం. ఎమ్మెల్యేల కంటే అద్భుతంగా సమస్యలపై చర్చించారు.
‘ లీప్ యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చాం. పిల్లలు ఎలా చదువుతున్నారో.. తల్లిదండ్రులు నేరుగా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. భారతదేశంలో ఆంధ్రా మోడల్ విద్యా విధానాన్ని రెండేళ్లలో తీసుకురావాలని సీఎం ఆదేశించారు. దీనిని నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నా వెన్నంటి ఉండి సలహాలు ఇస్తున్నారు.