LOKESH: అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ.. పంట నష్టంపై నివేదిక
‘మొంథా’ నష్టం రూ.6,352 కోట్లు
ఏపీలో మొంథా తుపాను కారణంగా రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రులు లోకేశ్, అనిత.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి నివేదిక అందజేశారు. పార్లమెంట్ హాల్లోని అమిత్ షా ఛాంబర్లో జరిగిన సమావేశంలో లోకేశ్, అనితతోపాటు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. మొంథా తుపాను వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. మొత్తం 3,109 గ్రామాలు తుపాను వల్ల ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా ఏపీ ప్రభుత్వం తరఫున రూ.3 వేలు అందించామని చెప్పారు.
తుఫానుతో భారీ నష్టం
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1302 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. మొత్తం రూ.6,352 కోట్ల నష్టంలో ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ.902 కోట్లు అవసరమన్నారు. తుపాను నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిపిందని అమిత్ షాకు లోకేశ్ తెలిపారు.
కేంద్ర వ్యవసాయమంత్రితో నారా లోకేష్ భేటీ
మొంథా తుపాను ప్రభావంతో ఉధృతంగా వీచిన గాలులు, భారీ వర్షపాతం, వరదలు అనేక గ్రామాలు, వ్యవసాయ భూములను తీవ్రంగా ప్రభావితం చేశాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మంత్రి లోకేష్... హోం మంత్రి అనితతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మొంథా తుపాను నష్టాన్ని వివరిస్తూ... ఈ తుఫాను మొత్తం 24 జిల్లాల్లోని 443 మండలాల పరిధిలో 3,109 గ్రామాలను ప్రభావితం చేసిందిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 9.53 లక్షల మంది ప్రజలు నష్టాన్ని చవిచూశారని. పంట మునిగిపోవడం వల్ల వ్యవసాయ జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, పౌర సేవా రంగాలకు భారీనష్టం సంభవించిందని వివరించారు. ఈ చర్యలు మానవ నష్టాలను తగ్గించడంతోపాటు బాధితులకు నిరంతర సహాయాన్ని అందించడంలో ఇబ్బందులు లేకుండా చేశాయని మంత్రి లోకేష్... కేంద్ర మంత్రికి వివరించి ఆదుకోవాలని కోరారు.