LOKESH: టాటా గ్రూప్ ఛైర్మన్‌తో నారా లోకేశ్ భేటీ
టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో లోకేశ్ భేటీ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ వినతి.. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలని టాటా గ్రూప్ ప్రతినిధులను ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని పలువురు పారిశ్రామికవేత్తల్ని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ముంబయ్ పర్యటనలో భాగంగా పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన భేటీ అయ్యారు. ఇందులో భాగంగా టాటా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్, ట్రాఫిగురా ఇండియా సీఈవో సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్టిమెంట్స్ హెడ్ సాదత్ షా, ఆ సంస్థలకు సంబంధించి వివిధ హోదాల్లోని ప్రముఖులతో లోకేశ్ కీలక చర్చలు జరిపారు. విశాఖలో ఈ నెలలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. టాటా పవర్ రెన్యూవబుల్స్ ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఏపీ ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా రూఫ్‌టాప్ సోలార్ అభివృద్ధి చేసే ప్రక్రియలో ప్రభుత్వంతో కలిసి పనిచేసే మార్గాన్ని అన్వేషించాలని, సెల్, మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకు వినతి
శ్రీసిటీలో ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించాలని కోరిన ఆయన.. టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఓఎస్ఏటీ ఏర్పాటు చేయాలని కూడా కోరారు. గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్లాట్‌ఫాం ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్టిమెంట్స్ అధిపతి సాదత్ షా, డైరెక్టర్ (లీజింగ్) ప్రకృత్ మెహతాతోనూ మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ముంబయిలోని తాజ్ ల్యాండ్స్ హోటల్లో జరిగిన ఈ భేటీలో ఏపీ సముద్ర ఎగుమతుల కోసం కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గిడ్డంగుల నిర్మాణం, పోర్టు ఆధారిత లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారికి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్లాట్ ఫాం ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్టిమెంట్స్ హెడ్ సాదత్ షా, డైరెక్టర్ (లీజింగ్) ప్రకృత్ మెహతాతో లోకేశ్ భేటీ అయ్యారు. లోకేశ్ మాట్లాడుతూ… విజనరీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ప్లగ్&ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 4.0 పెట్టుబడులకు అనుకూలంగా ఉందన్నారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి మార్గాల్లో 1,000 ఎకరాలకు పైగా మెగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.