LOKESH: రెడ్ బుక్ ఇంకా ముగియలేదు ఏం చేయాలో నాకు తెలుసు
ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు... మనకు ఓ విలన్ ఉన్నాడంటూ విమర్శలు.. రెడ్‌బుక్‌లో 3 పేజీలే అయ్యాయన్న మంత్రి... మళ్లీ ఎప్పుడు మొదలు పెట్టాలో నాకు తెలుసు
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను తీసుకున్నవారిని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలల్లో జైలు వేస్తామని వైఎస్ జగన్ హెచ్చరించడంపై లోకేష్ స్పందించారు. జగన్ అరెస్ట్ చేస్తామంటే తాము భయపడాలా? అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలులో పెట్టి ఏం పీకారు? అంటూ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు... ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు... అరెస్ట్ చేస్తామని మాట్లాడుతున్నాడు... మా నాయకుడిని అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి జైలులో బంధించి ఏం పీకావు... నువ్వు అరెస్ట్ చేస్తామంటే మేము భయపడాలా?... నీకన్నా ముందు కూడా చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు... వారి పరిస్థితి ఏమైందనేది ఒకసారి ఆలోచించుకో... ఎర్ర బుక్ (రెడ్ బుక్)లో మూడు పేజీలు అయ్యాయి... ఇంకా చాల పేజ్‌లు ఉన్నాయి... ఎవరికి ఎప్పుడూ ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు... చట్టాన్ని ఉల్లంఘించినవారిని ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు’’ అని అన్నారు.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. ‘జగన్‌తో ఎంత పోరాడానో పార్టీలో సంస్కరణలు తీసుకురావడానికి సొంతవారితోనూ అంతే పోరాడా. మారిన కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకొస్తున్నాం. ఈ రోజుకు కూడా చంద్రబాబునాయుడితో పోరాడతా. కానీ ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తలవంచి దాన్ని అమలుచేసే వ్యక్తిని నేను’ అని లోకేశ్ పేర్కొన్నారు. ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై వైకాపా కుట్ర చేస్తోందని లోకేశ్ విమర్శించారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా వంటి సంస్థలపై కోర్టులో వైకాపా పిల్ వేసిందన్నారు. తాజాగా రహేజా ఐటీ పార్కు పైనా పిల్ దాఖలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘ఈ ప్రాజెక్టులతో ఏపీ యువతకు లక్షకు పైగా ఉద్యోగాలు అందించే అవకాశముంది. యువత భవిష్యత్తుపై జగన్‌కు ఇంత ద్వేషమెందుకు? రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాలను అడ్డుకోవాలనే ఆలోచన సబబా?’’ అని లోకేశ్ నిలదీశారు.