AP: ప్రేమకు అడ్డుగా ఉన్నాడని యువతి తండ్రి హత్య
విజయవాడలో తీవ్ర కలకలం... యువతి తండ్రిని నరికిన మణికంఠ;
విజయవాడలో దారుణం జరిగింది. బృందావన్ కాలనీలో ప్రేమకు అడ్డుగా ఉన్నాడన కారణంతో కక్ష పెంచుకుని యువతి తండ్రిని ఓ యువకుడు అత్యంత పాశవికంగా చేశాడు. దీంతో విజయవాడలో కలకలం రేగింది. బృందావన్ కాలనీకి చెందిన శ్రీరామచంద్రప్రసాద్ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఆయన కుమార్తె దార్శని ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన శివ మణికంఠ ఓ ప్రైవేట్ స్కూల్‌లో పీఈటీగా పని చేస్తున్నాడు. వీళ్లిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్ల క్రితం మణికంఠకు, దార్శని ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. మణికంఠతో కుమార్తె తిరుగుతుందని తెలుసుకున్న శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను పిలిచి బుద్దిగా చదువుకోవాలని హితబోధ చేశాడు.
శ్రీరామచంద్రప్రసాద్ మణికంఠకు కూడా అదే చెప్పాడు. తన బిడ్డతో తిరగొద్దని సర్ధి చెప్పాడు. అది జరిగిన తర్వాత దార్శని మణికంఠతో మాట్లాడటం మానేసింది. అయినా మణికంఠ ఆమె వెంట పడటం మానలేదు. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తూ వచ్చాడు. మణికంఠ ప్రవర్తనతో విసిగిపోయిన శ్రీరామచంద్రప్రసాద్ పెద్ద మనుషులను తీసుకెళ్లి తన బిడ్డ జోలికి రావద్దని చెప్పాలని మణికంఠ తల్లికి చెప్పాడు. దార్శనిని దూరం చేయడంతో శ్రీరామచంద్రప్రసాద్‌పై మణికంఠ కసి పెంచుకున్నాడు. దీనికి తోడు ఇంట్లో విషయం చెప్పి తిట్టించడంతో మరింత కోపం రెట్టింపైంది. ఈ గొడవతోనే తన తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో పగతో రగిలిపోయిన మణికంఠ గురువారం కాపు కాసి కె.శ్రీరామచంద్రప్రసాద్‌ను హత్య చేశాడు.
కిరాణ దుకాణం కట్టేసి తండ్రీ కుమార్తె వస్తున్న సమయంలో తన బైక్‌తో వారి బైక్‌ను ఢీ కొట్టాడు. కింద పడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌పై దాడి చేశాడు. చేతిలో ఉన్న కత్తిలో విచక్షరహింతగా నరికాడు. దార్శని ఎంత చెబుతున్నా వినిపించుకోలేదు. చివరకు ఆమెను కూడా చంపుతానని బెదిరించాడు. గొడవ సంగతి తెలుసుకొని స్థానికులు రావడంతో మణికంఠ పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న కె.శ్రీరామచంద్రప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.