Heavy Rains Alert : అల్పపీడనం ఎఫెక్ట్: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా రాష్ట్రాలపై ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి సెప్టెంబర్ 26న తీరాన్ని తాకి అనంతరం వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వైజాగ్ వెదర్ మ్యాన్ అంచనా వేస్తుంది. ఇక తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించింది. సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నల్గొండ, మెదక్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా గత రెండు, మూడు రోజులుగా హైదరాబాద్‌లో సాయంత్రం భారీ వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.