బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
వర్షాలు కురిసే ప్రాంతాలు
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం, మణ్యం, ఏలూరు, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. విశాఖలోని గాజువాకలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత గాజువాక సిగ్నలింగ్ సెంటర్ నుంచి బస్టాప్ వరకు హైవేపై నీరు నిలిచిపోయింది.