Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నేడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం శాసనసభా కార్యదర్శికి ఆళ్ల రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో ఆళ్ల పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఆళ్ల ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో వైసీపీలో కలకలం రేగింది. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటనతో వైకాపా శ్రేణులు విస్మయానికి గురయ్యాయి. రాజీనామా కారణాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆళ్ల తెలిపారు. మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవికి ఆ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఆర్కే అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవికి, వైసీపీకు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని... స్పీకర్ కార్యాలయంలో లేఖను అందజేశానని ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు. దీన్ని ఆమోదించాలని స్పీకర్‌ను కోరానని... రాజీనామాకు గల కారణాలను త్వరలో తెలియజేస్తానని ఆయన చెప్పారు.