శాసనసభ లాబీలో సభ్యులతో మార్షల్స్ వ్యవహరించిన తీరుపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల పట్ల మార్షల్స్ అతిగా ప్రవర్తించడాన్ని ఆయన తప్పుబట్టారు.
గురువారం నాడు జరిగిన ఒక సంఘటనలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర శాసనసభ లాబీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఒక మార్షల్ అక్కడికి వచ్చి.. ఇక్కడ ఎవరూ ఉండకూడదు, వెళ్లిపోవాలి అని గట్టిగా చెప్పారు. అంతేకాకుండా నరేంద్రపై చేయి వేసి నెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే నరేంద్ర మార్షల్‌పై మండిపడ్డారు.
ఈ విషయం గమనించిన మంత్రి లోకేశ్ వెంటనే బయటకు వచ్చి, మార్షల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని? ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలోనే ఉన్నామనుకుంటున్నారా?' అని ఆయన నిలదీశారు. పాస్‌లు లేని వ్యక్తులు లోపలికి రాకుండా చూడాల్సిన బాధ్యత మాత్రమే మార్షల్స్‌కు ఉందని, ఎమ్మెల్యేల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ సంఘటన శాసనసభ లాబీలో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది.