MLC ELECTIONS: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓటింగ్... ఓటు హక్కు వినియోగించుకుంటున్న పట్టభద్రులు;
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8గంటలకు ఆరంభమైన పోలింగ్.. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూడేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. తెలంగాణలో ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గంతోపాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 90 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ నియోజవర్గాలకు ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది.
తెలంగాణలో...
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సీటులో 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్ -నిజామాబాద్-ఆదిలాబాద్ -కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గంలో 27,088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. వరంగల్ -ఖమ్మం- నల్గొండ టీచర్స్ స్థానంలో 25,797 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. 19 మంది బరిలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఏపీలో 6 లక్షల 62 వేల మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండు చోట్ల దాదాపు 60 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధికారులు 939 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచరర్ ఎమ్మెల్సీ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ స్థానంలలో అభ్యర్థిని ఎన్నుకునేందుకు 22,493 మంది ఉపాధ్యా యులు ఓటు వేయనున్నారు.