LOKSEH: నా రక్తం మరుగుతోంది
కోపం కట్టలు తెచ్చుకుంటోందన్న లోకేశ్... తెలుగు ప్రజలకు బాధతప్త హృదయంతో బహిరంగ లేఖ;
చేయని నేరానికి తన తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలు తరలించడం చూస్తే తన రక్తం మరిగిపోతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై బాధతప్త హృదయంతో లోకేశ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తన తండ్రి చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్ చేయడం చూస్తుంటే... తన రక్తం మరుగుతోందని, కోపం కట్టలు తెంచుకుంటోందని నారా లోకేశ్ అన్నారు. బాధతో, బరువెక్కిన హృదయంతో, తడిసిన కళ్లతో ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. లక్షలాది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు విశ్రాంతి రోజే తెలియదని, ఆయన రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం, నిజాయతీతో ఉంటాయని గుర్తు చేశారు.
దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఎంతో చేసిన వ్యక్తి.. ఇలాంటి అన్యాయాన్ని ఎందుకు భరించాలని ప్రశ్నించారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం, అవకాశాలను ఇతరుల కంటే ముందే ఊహించినందుకా అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సేవలను పొందినవారి ప్రేమ, కృతజ్ఞతల నుంచి ఆయన ఆస్వాదించిన లోతైన ప్రేరణను చూశానని, వాళ్ల హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయనలో స్వచ్ఛమైన ఆనందాన్ని నింపాయని గుర్తు చేసుకున్నారు. అవి పిల్లల ఆనందానికి సమానమైనవని, తానూ ఆయన నుంచి ప్రేరణ పొందే అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదులుకొని భారత్‌కు తిరిగొచ్చానని లోకేశ్ లేఖలో ప్రస్తావించారు. ఇది కఠినమైన నిర్ణయమైనా.. తనకు మన దేశం, వ్యవస్థలు, అన్నింటికిమించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉందని ట్వీట్ చేశారు.
ఈ రోజు ద్రోహంలా అనిపిస్తుందన్న లోకేశ్ చంద్రబాబు పోరాటయోధుడని గుర్తు చేశారు. తాను కూడా అంతేనని ఏపీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ల కోసం... తిరుగులేని శక్తితో ఎదుగుతామన్నారు. ఈ యుద్ధంలో కలిసి రావాలని ప్రజలకు లోకేశ్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు యువగళం పాదయాత్రకు లోకేశ్ కొన్ని రోజుల పాటు విరామం ఇవ్వనున్నారు. పాదయాత్ర శుక్రవారం నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా పొదలాడకు చేరుకుంది. పరిస్థితులు సర్దుకున్నాక మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తారని తెలుస్తోంది.