ECI: ఏపీలో హింసపై ఈసీ సీరియస్...
తొలిసారిగా డీజీపీ నుంచి ఎస్‌ఐల వరకు చర్యలు;
ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇవాళ రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ... పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని నిర్ధారించింది. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్టు నివేదిక అందిందని ఈసీ వెల్లడించింది. స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించినట్టు సీఎస్, డీజీపీ తెలిపారని స్పష్టం చేసింది.ఈ క్రమంలో ఈసీ కఠిన చర్యలు తీసుకుంది.
పోలింగ్ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ తెలిపింది. సీఎస్, డీజీపీతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.
పల్నాడు జిల్లాలో చెలరేగిన అల్లర్లను అడ్డుకట్టవేయడంలో విఫలమవ్వడంతో జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్‌పై బదిలీ వేటు వేయగా ఎస్పీ బిందు మాదవ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. మారణాయుధాలు, నాటు బాంబులతో భారీ విధ్వంసానికి వైఎస్సార్సీపీ కుట్ర పన్నినట్లు పోలీసుల తనిఖీల్లో స్పష్టమైంది. ఈ స్థాయిలో విధ్వంసానికి తెర తీసినా పోలీసులు నిలువురించడంలో విఫలమవ్వడంతో ఈసీ చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌ను బాధ్యుడిగా చేస్తూ ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలోని 9వ వార్డులోని పోలింగ్ బూత్ సమీపంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనచరులు టీడీపీ కార్యకర్తలపై రాళ్లదాడులకు పాల్పడ్డారు. పోలింగ్ మరుసటి రోజున 14వ తేదీన వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో టీడీపీ నేత సూర్యముని ఇంటిపై దాడిచేశారు. వరుస సంఘటనలు జరుగుతున్నా తాడిపత్రి డీఎస్పీ గంగయ్య అదుపుచేయలేక విఫలమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి డా.వినోద్ కుమార్ ను నివేదిక కోరింది. సీఈసీ ఇచ్చిన ఆదేశాల్లో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌తో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది.