BRAHMANI: బాబుతోనే నేను: నారా బ్రాహ్మణి

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా నారా బ్రహ్మణి పోస్ట్‌.... ఉద్యమంగా మారుతున్న ఆందోళనలు....;

Update: 2023-09-16 01:00 GMT

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనలతో కదం తొక్కుతున్నాయి. మరోవైపు పార్టీలకు అతీతంగా అందరూ నేతలు చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారు. హైదరాబాద్, బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్ల మీదకు రాగా.. మరోవైపు ఇంజినీరింగ్ విద్యార్థులు సైతం బాబుకు మద్దతుగా కదులుతున్నారు. ఈ ఆందోళనల క్రమంలో ఐయామ్‌ విత్‌ బాబు (I Am With Babu) హ్యాష్ ట్యాగ్ వైరల్ అయ్యింది. ఈ క్రమంలో నారా బ్రాహ్మణి చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.


చంద్రబాబు అరెస్ట్‌తో మొదలైన ఆందోళన ఉద్యమంగా మారుతున్న తరుణంలో ఐయామ్‌ విత్‌ సీబీఎన్‌ (I Am With CBN) హ్యాష్ ట్యాగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నారా బ్రాహ్మణి చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. భవిష్యత్ తరాలను కాపాడటానికి బాబుతో నేను అంటూ నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. చంద్రన్న పెళ్లికానుక ద్వారా లబ్ధిపొందిన దంపతులు రాజమండ్రి వరకూ వెళ్లి మద్దతు తెలపగా.. వారి కుమారుడు అనిత్ కుమార్.. నేను సైతం అంటూ చంద్రబాబు, లోకేశ్‌కు మద్దతు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారి అనిత్ కుమార్ మాటలు ఎంతో ముద్దొచ్చాయన్న బ్రాహ్మణి ఆ సందర్భాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.


2024లో చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకూ పోరాడుతూనే ఉంటామని.. తను సమస్యల్లో ఉన్నా ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న చంద్రబాబు, నారా లోకేశ్‌కు హృదయ పూర్వక అభినందనలని నారా బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్‌ తెలుగుదేశం శ్రేణులకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. చంద్రబాబు కోసం కుటుంబం అంతా అండగా నిలబడడం.. నారా బ్రాహ్మణి కూడా ఈ పోరాటంలో పాల్గొంటానంటూ ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జగన్‌ నిరంకుశ విధానాలపై పోరాటానికి అన్ని శక్తులను కూడదీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నాయి.

ఇప్పటికే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబును పవన్‌కల్యాణ్‌, బాలకృష్ణ, లోకేశ్‌ కలిశారు. చంద్రబాబు అరెస్టుపై విచారం వ్యక్తం చేసిన పవన్‌... కేవలం రాజకీయ కక్షలో ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను పవన్‌ పరామర్శించారు.

Tags:    

Similar News