LOKESH: "తిరుపతి లడ్డు"పై వైవీ సుబ్బారెడ్డికి లోకేశ్ సవాల్
ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని లోకేశ్ ప్రకటన.. మీరు రెడీనా అని సవాల్;
తిరుమల లడ్డూ తయారీకి జంతువు కొవ్వు వాడిన మాట నిజమే అని విజిలెన్స్ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో తేలిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. తిరుమలను అపవిత్రం చేసిన వారిని వదలబోమని మంత్రి తేల్చి చెప్పారు. తాను తిరుపతిలోనే ఉన్నానని.. అవసరమైతే ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని టీటీడీ మాజీ ఛైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డికి సవాలు విసిరారు. తాను తిరుపతిలోనే ఉన్నానని.. అవసరమైతే ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రమాణం చేసేందుకు మీరు రెడీనా? అని లోకేశ్ సవాలు విసిరారు. లేదంటే జగన్ నువ్వు వస్తావా? అని లోకేశ్ మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవదేవుని మహా ప్రసాదంగా భావించే లడ్డూలో గొడ్డు మాంసం కలిపారని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వెల్లడించిందని లోకేశ్ తెలిపారు. ఈ విషయంలో అందరి పైనా చర్యలు ఉంటాయని.. శిక్షలు ఉంటాయని లోకేశ్ తేల్చి చెప్పారు. జగన్ మోహన్ రెడ్డికి దేవుడిపైనా నమ్మకం లేదని.. ప్రజలపైనా నమ్మకం లేదని.. ప్రజలు ఇచ్చిన తీర్పుపైనా నమ్మకం లేదని లోకేశ్ అన్నారు.
ప్రక్షాళన షురూ...
ఇప్పటికే టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించామని చంద్రబాబు వెల్లడించారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అన్నదానంలోనూ నాసిరకం సరుకులు వాడారని మండిపడ్డారు. కాగా, గత వైసీపీ సర్కారు హయాంలో తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలు వాడినట్లు రిపోర్టులో బయటపడింది. దీంతో పాటు చేప నూనె, బీఫ్ కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైంది. దీంతో చంద్రబాబు స్పందించి.. గత వైసీపీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నలుగురు సభ్యుల కమిటీ
తిరుమల లడ్డూ తయారీ కోసం వినియోగించే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్స్‌తో పాటు ఫిష్ ఆయిల్ వంటి అవశేషాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్ట్స్ బహిర్గతం అయిన గంటల వ్యవధిలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపేందుకు నలుగురు సభ్యుల కమిటీని వేసింది. ఈ కమిటీలో డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ మాధవన్ సభ్యులుగా ఉంటారని ఈవో చెప్పారు. వారంలో ఈ కమిటీ తన నివేదికను సమర్పించనుంది.