TDP-JANASENA: ఆరంభం అదిరింది

ఎన్నికల శంఖారావం పూరించిన జనసేన-టీడీపీ... ఐక్యత, సమన్వయానికి అద్దం పట్టిన సభ

Update: 2023-12-21 03:30 GMT

విజయనగరం జిల్లాలోని పోలిపల్లి పొలికేక పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికింది. తెలుగుదేశం, జనసేన పొత్తు నిర్ణయం అనంతరం.... చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపైకి వచ్చిన తొలి సభ...... సూపర్‌ హిట్టయింది. 'మేటి ప్రజాశక్తుల మహా కలయిక.. నవశకం ప్రారంభ వేడుక’ అనే సభ ఉద్దేశానికి తగ్గట్టుగానే... సభ జరిగింది. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు. తెదేపా, జనసేన నాయకులు... మైత్రీబంధానికి ఎంత విశేష ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పేందుకు ఈ సభ నిదర్శనంగా నిలిచింది.


రెండు పార్టీలు పొత్తు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకుల మధ్య చిన్నపాటి విభేదాలు, పొరపొచ్చాలు తలెత్తకుండా మైత్రీబంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలుగుదేశం, జనసేన నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అది యువగళం సభలోనూ ప్రతిఫలించింది. యువగళం నవశకం.. ఇదేదో తెదేపా సభ అన్నట్టు కాకుండా తెదేపా-జనసేన ఉమ్మడి సభ అన్న భావన కలిగించేలా నిర్వహించారు. కటౌట్‌లు, ఫ్లెక్సీలు, జెండాలు, బెలూన్‌లు సహా అన్నిటిపైనా ఇరుపార్టీల నాయకుల చిత్రాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్ద చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణతో పాటు పవన్‌ కల్యాణ్‌కు సమాన స్థాయిలో భారీ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపైకి వచ్చారు. సభలో అగ్రనేతల ప్రసంగాల్లోనూ పరస్పర గౌరవం, అభిమానం వ్యక్తపరిచారు. ఒకరి సుగుణాలను మరొకరు ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెదేపా, జనసేన అగ్రనేతలు మైత్రీబంధానికి ఎంత విలువ ఇస్తున్నారనడానికి యువగళం సభ నిదర్శనంగా నిలిచింది. ఆత్మీయ నేస్తాన్ని, ఆత్మబంధువుని స్వాగతించినట్టుగా... పవన్‌ కల్యాణ్‌కు... తెలుగుదేశం నేతలు అపూర్వ స్వాగతం పలికారు.


పవన్‌ కల్యాణ్‌ వేదిక వద్దకు రావడానికి కొంచెం ముందే చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ అక్కడికి చేరుకుని... ముగ్గురూ ఆయన కారు వద్దకు వెళ్లి ఆత్మీయంగా స్వాగతం పలికారు. పవన్‌ను వెంట తోడ్కొని వేదికపైకి తీసుకెళ్లారు. పవన్, బాలకృష్ణ.. ఒకరినొకరు సోదర సమానుడని సంబోధించుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ను.. లోకేశ్‌, పవనన్న అంటూ ఆత్మీయత కనబరిచారు. యువగళం-నవశకం సభకు పసుపు దండు, జనసైనికులు కదం తొక్కారు. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా లెక్కచేయకుండా సభకు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా... ప్రైవేటు బస్సులు ఇవ్వకుండా ప్రభుత్వం బెదిరించినా.. తగ్గేదేలా అంటూ సొంత వాహనాల్లో సభకు పోటెత్తారు. ఉదయం 11 నుంచే సభకు జన ప్రవాహం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి సభా ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. యువగళం-నవశకం సభ కనీవిని ఎరగని రీతిలో జరిగిందని తెదేపా, జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. ఒకే వేదికపైన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌, బాలకృష్ణలను చూసి సంబరపడ్డారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే పోలిపల్లి సభ చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. యువగళం విజయోత్సవసభకు వచ్చిన వాహనాల క్రమబద్ధీకరణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాహనాలను జాతీయ రహదారికి బదులు సర్వీసు రోడ్డుపైకి మళ్లించారు. దీంతో మూడు గంటలపాటు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో వందలాది వాహనాలు ఎటు కదల్లేక ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

Tags:    

Similar News