Nimmagadda Ramesh : నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు

లోపాలు సవరించకుండానే ఏపీలో ముసాయిదా జాబితా... ఓటర్ల జాబితాపై విమర్శల మాటేంటని ప్రశ్న

Update: 2023-12-11 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో లోపాలను సవరించకుండానే ముసాయిదా జాబితా విడుదల చేశారని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు ఆరోపించారు. గతంలో BLOలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారని ఇప్పుడు పార్టీలకు అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటర్ల జాబితాపై విమర్శలు ఉన్నాయని, దీనికి సిబ్బంది వ్యవహారమే కారణమని ఆరోపించారు. ఓట్లు గంపగుత్తగా తొలగించరాదనే CEC నిబంధనలు ఏపీలో అమలు కాలేదని ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు.

రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం సలహాదారులను నియమించిందని వారు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీలో రాజ్యాంగబద్ధమైన పాలన లేకపోతే ప్రమాదాలు జరుగుతాయని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. చట్టసభల్లో ప్రజాస్వామ్య స్పూర్తితో... చర్చలు జరగాలని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీన పరిచి.. దేశం దృష్టిలో ఆంధ్రప్రదేశ్‌ను చులకన చేసుకోవద్దని ప్రజా ప్రతినిధులను, అధికారులను కోరారు. ప్రజలకు మద్దతుగా నిలుస్తూ.. వ్యవస్థాగతంగా వారికి ఉన్న హక్కులను గుర్తు చేసేందుకు, వారి హక్కులను సాధించేందుకు గల మార్గాలను సుగమం చేయడానికి సిటిజన్‌ ఫర్‌ డమోక్రసీ ప్రయత్నం చేస్తుందని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. పాలకులే న్యాయం చేయకపోతే పౌరులు ఎక్కడికి వెళ్లాలని మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోయి శ్రీలంక దివాలా తీసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పౌరులకు తమ హక్కులపై అవగాహన ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని సంపాదించడం ఎంత కష్టమో.. ప్రజాస్వామ్యబద్దంగా బతకడం కూడా అంతే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.

మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే కార్యక్రమానికి ప్రభుత్వ వ్యవస్థను వాడుకోవటం తగదని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సమాచార హక్కు చట్టం భ్రష్టు పట్టిపోయిందని.. సలహాదారులకు కేబినెట్ హోదా ఇవ్వటం రాజ్యాంగబద్ధం కాదన... సలహాదారులు రాజ్యాంగేతర శక్తుల్లా తయారయ్యారని మండిపడ్డారు. బ్రిటీష్ కాలంలో పెట్టిన సెక్షన్ 30 నియమిత కాలం మాత్రమే ఉండాలని... దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం వినియోగించటం రాజ్యాంగానికి విరుద్ధమని మండిపడ్డారు. బూత్ స్థాయిలో నిర్వీర్యం చేసేందుకే తప్పులు కేసులు పెడుతున్నారనే విమర్శలొస్తున్న నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశామని... ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీ గా పనిచేసిన సీనియర్ ఐ.పి.ఎస్.అధికారి ఎం.వి. భాస్కరరావు నేతృత్వంలో హిందూ దినపత్రిక విజయవాడ ఎడిషన్ పూర్వ రెసిడెంట్ ఎడిటర్ వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ పూర్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనగాని సత్యప్రసాద్‌లతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను వీరు ఆవిష్కరిస్తారని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పేర్కొన్నారు.

Tags:    

Similar News