బుడమేరుతో భయపడాల్సిన అవసరం లేదని, అక్కడ వరద పరిస్థితి ఏమీ లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. 3 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని, పరిస్థితి అంతా నియంత్రణలోనే ఉందని ఆయన తెలిపారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని అన్నారు. పోతుల వాగు, నల్ల వాగు వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో వరద పరిస్థితిపై హోంమంత్రి అనిత, ఇతర ఉన్నతాధికారులు ఆరా తీశారని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం, వరంగల్‌లో కురుస్తున్న వర్షాలతో మున్నేరు వాగుకు వరద నీరు వస్తోందని, అయితే దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బందికర పరిస్థితులు లేవని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే 95 గ్రామాలపై భారం పడుతుందని అన్నారు. వారికి ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, కొండ ప్రాంతంలో ఉన్న వారు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అన్నారు. పల్లె నుంచి వట్నం వరకు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు.