దీపావళి పండుగ వేళ ఏపీలోని ఏలూరు విషాదం చోటు చేసుకుంది. నగరంలోని తూర్పు వీధిలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు టపాసులు తీసుకెళ్తుండగా వాహనం గుంతలో పడి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా మంటలకు కాలిపోయింది. మృతుడిని సుధాకర్ గా పోలీసులు గుర్తించారు. పేలుడు ధాటికి అతని శరీర భాగాలు ఛిద్రమై.. చుట్టుపక్కల ఉన్న ఇళ్ల ముందు పడటంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. పరిసరాల్లో ఉన్న టూ వీలర్లు, పలు ఇండ్ల కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.