పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిపై కర్ణాటక నిర్మించిన ఆల్మట్టి జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. రేపు ఉదయానికి ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులను దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆల్మట్టిలో నీటి నిల్వ 85 టిఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 130 టీఎంసీలు. శుక్రవారం నాటికి రిజర్వాయర్ గేట్లు తెరిచే అవకాశం ఉంది. ఎగువ నుంచి భారీ వరద వస్తోందని సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి హెచ్చరిక అందడంతో జలవిద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన ప్రారంభించారు. ఆల్మట్టికి పోటెత్తుతున్న వరద మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే శ్రీశైలానికి నీటి రాక మొదలవుతుంది. ఆగస్టు చివరి నాటికి శ్రీశైలం, నాగార్జున జలాశయాలు నిండే అవకాశం ఉంది. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపుర జలాశయంలో 25 టిఎంసీల ఖాళీ ఉంది. దాని కింద ఉన్న తెలంగాణాలోని జూరాల జలాశయం నీటి నిల్వ స్థానిక వర్షాలతో దాదాపు గా పూర్తి స్థాయికి చేరింది. అల్మట్టి, నారాయణపుర రిజర్వాయర్ల గేట్లు తెరిస్తే జూరాలలో జలవిద్యుత్తు కేంద్రాలను వినియోగంలోకి తెస్తారు. కృష్ణా ఉపనదలు తుంగ, భద్ర నదులపై రిజర్వాయర్లు వేగంగా నిండుతున్నాయి.