AP ROADS: చుక్కలు చూపిస్తున్న ఏపీ రోడ్లు

రోడ్డెక్కాలంటే భయపడిపోతున్న వాహనదారులు.... ప్రయాణమంటేనే వణికిపోతున్న ప్రజలు

Update: 2023-11-28 03:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రోడ్లతో పడుతున్న ఇబ్బందులు ఒక ఎత్తైతే విస్తరణ పేరిట నెలల తరబడి వాహనదారుల కళ్లల్లో దుమ్ముకొడుతున్న రోడ్లు మరో ఎత్తు. విజయనగరం జిల్లా రాజాంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు మూడు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. రహదారి విస్తరణ పనులు అర్థంతరంగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలోని ప్రధాన రహదారిపై ప్రయణమంటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఈ ఏడాది జనవరిలో విస్తరణ పేరిట రోడ్డును తవ్వి వదిలేయడంతో... పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పట్టణంలోని ప్రధాన రహదారి మొత్తం ఛిద్రమైంది. ముఖ్యంగా అంబేద్కర్ కూడలి నుంచి డోలపేట తనిఖీ కేంద్రం దాటే వరకు అడుగుకో గొయ్యి కనిపిస్తోంది. కొన్నిచోట్ల 10 నుంచి 15 అడుగుల మేర దాదాపు పూర్తిగా కోతకు గురై తటాకాలను తలపిస్తున్నాయి. డోలపేట- మారుతీనగర్ కూడలి వద్ద గుంతల్లో వారం రోజుల కిందట ఒక భారీ వానహం కూరుకుపోవటంతో... రెండు, మూడు రోజులు వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు.


అధికారులు పట్టించుకోవడంతో పట్టణానికి చెందిన ఓ వైద్యుడు సొంత నిధులతో నాలుగు క్రేన్లు తెప్పించి... ఆ వాహనాన్ని బయటకు తీయించారు. ఈనెల 23న ఇదేచోట మరో రెండు ఇసుక లారీలు కూరుకుపోయి... ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు ఎన్నో వ్యయప్రయాసలతో వాటిని పక్కకు తీయగానే......చెరుకు లోడుతో వెళ్తున్న లారీ అదే గోతిలో బోల్తాపడింది.


గత ప్రభుత్వ హయాంలో ప్రధాన రహదారులను 80 అడుగుల మేర విస్తరించాలని నిర్ణయించారు. నిధులు మంజూరు చేయగా....ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా చీపురుపల్లి రోడ్డు నుంచి పాలకొండ రోడ్డులోని G.M.R ఐటీ వరకు కిలోమీటరున్నర రోడ్డు విస్తరణ పనులకు ఈ ఏడాది జనవరిలో శ్రీకారం చుట్టారు. ఆ పనులు నత్తనడకన సాగుతుండగా... అంతంత మాత్రంగా ఉన్న రహదారి ఛిద్రమైయిపోయింది. ప్రస్తుత వర్షాలకు మరింత అధ్వానంగా మారటంతో స్థానికులతోపాటు..... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజాంలోని ప్రధాన మార్గంలో రెండు కిలోమీటర్లు ప్రయాణించాలంటే గంట సమయం పడుతోందని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు పొడవునా అడుగడుగునా గుంతలు ఏర్పడటంతో... ఎటువైపు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. అత్యవసర సమయంలో ఈ మార్గాన్ని నమ్ముకుంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనంటున్నారు.

Tags:    

Similar News