PAWAN: మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ధీమా... \రూ.5 వేల కోట్ల హైవేలకు శంకుస్థాపన... భారత ఐక్యతకు పునాదన్న పవన్;
ఏపీలో సుస్థిరమైన అభివృద్ధి కోసం.. 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లో రెండు కీలక జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా.. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏజెన్సీ గ్రామాల్లో డోలీ మోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీఎం చంద్రబాబుకి చెబితే.. రూ.1000 కోట్లు కేటాయించడం ద్వారా.. రోడ్ల నిర్మాణం జరుగుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ రోడ్లు టూరిజంతోపాటూ.. యువతకు ఉపాధి కల్పిస్తున్నాన్న ఆయన… అటవీ అనుమతులతో ప్రతీదీ పక్కాగా ప్లాన్స్ చేస్తు్న్నామని తెలిపారు. ప్రధాని మోదీ దృష్టి, నితిన్ గడ్కరీ కృషి, చంద్రబాబు సంకల్పంతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది అన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేదే లక్ష్యమన్న పవన్ కళ్యాణ్… గడ్కరీని హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాని ప్రశంసించారు. గడ్కరీ ప్రారంభించిన రహదారులు మదనపల్లె-పీలేరు, కర్నూలు-మండ్లెం జాతీయ రహదారులు. ఇవి రూ.5,233 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో భాగంగా విస్తరణ పూర్తి చేసుకున్నాయి. ఈ రహదారులతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటూ.. రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అంచనా. . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కలిసే సాగుతాం
కూటమిలో ఉన్న మూడు పార్టీల్లోని నేతలు, కార్యకర్తలకు చిన్నచిన్న పొరపచ్చాలు ఉన్నా.. మీ స్ధాయిలోనే పరిష్కరించుకొని ముందుకెళ్లాలని పవన్ కల్యాణ్ సూచించారు. మన కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి వైసీపీ నేతలు ఎంతో ప్రయత్నం చేస్తారని.. మనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అభివృద్ధిలో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ తిరిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని ఆకాంక్షించారు. కనీసం 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలని ఉద్ఘాటించారు. తమ ఈ ప్రయత్నం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని నొక్కిచెప్పారు. ఈరోజు రోడ్లు వేయడమే కాదని.. ఇది భారత భవిష్యత్తుకు బలమైన పునాదని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ఈ దేశ ప్రగతికి చిహ్నాలు రవాణా మార్గాలని నొక్కిచెప్పారు. గోల్డెన్ క్వార్డలేటర్ ద్వారా రహదారులు దేశ దశదిశను దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పాయి మార్చారని కొనియాడారు. గత జగన్ ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం నుంచి సహకారం వచ్చినా సరైన విధంగా స్పందించలేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జగన్ పాలన ఓ విధ్వంసమని అన్నారు.