PAWAN: అడవి తల్లి బాటలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
డోలీ మోతల రహిత మన్యమే లక్ష్యం.. గిరిజన ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణం... వేగంగా రూ.1005 కోట్లతో భారీ ప్రాజెక్ట్;
ఆ ప్రాంతాల ప్రజలు ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు సౌకర్యం... ఇప్పుడిప్పుడే అంది వస్తోంది. కొండలు, అడవులు, లోయల మధ్య ఉంటూ రోడ్డు అనే మాట విని కూడా చూడని గిరిజన ఆవాసాల జీవితం ఇప్పుడిప్పుడే మారుతోంది. ఒక నిర్ణయం, ఒక ప్రణాళిక ఇప్పుడు వారిని అభివృద్ధి దిశగా నడిపించబోతుంది. ఈ ప్రణాళిక పూర్తయ్యే సరికి, ఆ ప్రాంతాల ప్రజలకు ఇది నిజమైన పండుగవలె మారనుంది. ఆ నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్. అడవి తల్లి బాట పేరుతో డోలి మోతల రహిత మన్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆదివారం మధ్యాహ్నం గిరిజన ప్రాంతాల్లో రహదారి పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ‘అడవి తల్లి బాట’ పేరుతో చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు రహదారి సౌకర్యం అందనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పీఎం జన్ మన్ పథకం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఉప ప్రణాళిక నిధులు కలిపి మొత్తం రూ. 1005 కోట్లతో చేపట్టబడింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు రహదారి సౌకర్యం లేని ఆవాసాలను కూడా అనుసంధానించేలా రెండు దశల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి.
పవన్ కీలక ఆదేశాలు
గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఏ పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ పనుల్లు త్వరితగతిన పూర్తి చేస్తే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పడుతుందని అన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించన పవన్... డోలీ మోతల రహిత మన్యమే లక్ష్యంగా ముందుకు సాగాలాని ఆదేశించారు. రెండు వారాలకోసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి పనుల స్థితిగతులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులతో పవన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం జన్ మన్ పథకంతో పాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఉప ప్రణాళిక నిధులు కలిపి రూ.1005 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈ పనుల గురించి స్థానికులకు తెలియజేయడం ఎంతో అవసరమని పవన్ అన్నారు. డోలీరహిత ఆవాసాలు ఉండాలనే సంకల్పంతో చేపట్టిన విషయాన్ని వారికీ చెప్పాలని తద్వారా వారి సహకారం, ప్రోత్సాహం కూడా లభిస్తుందని చెప్పారు.