ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో జరుగుతోన్న తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ఏపీ అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని పవన్ ఆరోపించారు. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. "సామాజిక మాధ్యమాల ముసుగులోనో, యూట్యూబ్ ఛానెళ్ల పేరుతోనో, మరో మార్గంలోనో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఇలా కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని పదేళ్లుగా చూస్తున్నాం. వారి ఉచ్చులో పడి, ఆవేశాలకు లోనై, ఘర్షణ వాతావరణానికి తావీయవద్దు. అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి" అని పవన్ ప్రజలకు సూచించారు.
వైఎస్ జగన్కు ఏపీ మంత్రి లేఖ
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు చేయడం తగదని సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం ఆపాలని కోరారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని వైసీపీ అబద్దాలు చెప్తోందన్న మంత్రి.. రూ. 8480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి కేవలం రూ. 1, 451 కోట్లకే బిల్లులు చెల్లించారని గుర్తు చేశారు. వైసీపీ హాయంలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లోనూ అడ్మిషన్లు తీసుకు రాలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చాకే మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై దృష్టి పెట్టామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ లా కూటమి ప్రభుత్వం విఫలం కాకూడదనే పీపీపీ విధానం ఎంచుకున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలియజేశారు. పీపీపీకీ, ప్రైవేటీకరణకూ చాలా వ్యత్యాసం ఉందన్నారు. మెడికల్ కాలేజీలపై తన వివరణకు జగన్ స్పందించాలని కోరారు. మీరు చేయని వాటి గురించి కూడా చెప్పుకోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా మెడికల్ కాలేజీలపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు.