PAWAN: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టుకు పవన్

ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు

Update: 2025-12-12 10:45 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికల్లో తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యక్తిగత విషయాలను వైరల్ చేస్తున్నారని, అభ్యంతరకర పోస్టులు ప్రచారం అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో, అటువంటి అభ్యంతరకర పోస్టులను, లింకులను తక్షణమే తొలగించాలని ఆయా వేదికలకు ఆదేశాలు ఇవ్వాలని, వాటిని ప్రచారంలోకి తీసుకొచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

పవన్ కల్యాణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ అభ్యంతరకరంగా భావిస్తున్న లింకులను రెండు రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని పవన్ కల్యాణ్ న్యాయవాదిని ఆదేశించింది. అంతేకాకుండా, పిటిషనర్‌కు అభ్యంతరకరంగా ఉన్న లింకులను ఏడు రోజుల్లోగా ఆయా సోషల్ మీడియా వేదికలు తొలగించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు డిసెంబరు 22కు వాయిదా వేసింది.

గతంలోనూ సినీ ప్రముఖుల పిటిషన్లు:

వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే అంశాలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ప్రముఖులలో పవన్ కల్యాణ్ కొత్తవారు కాదు. గతంలో ఇదే అంశంపై టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, శిల్పాశెట్టి, కరణ్ జోహార్, అనిల్ కపూర్ వంటి సినీ ప్రముఖులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వంటి ఇతర రంగాల ప్రముఖులు కూడా గతంలో తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.  అంశంపై తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Tags:    

Similar News