PAWAN; గూడెం గూటికి పండగొచ్చింది
మరో వాగ్దానం నెరవేర్చిన డిప్యూటీ సీఎం పవన్.. అల్లూరి జిల్లా గూడెం గ్రామానికి విద్యుత్ వెలుగులు.. ఏడున్నర దశాబ్దాల తర్వాత గ్రామాల్లోకి కరెంట్
డిప్యూటీ సీఎం పవన్ మరోసారి తన కార్య దక్షతతో ప్రజల మనసు దోచుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా ఇంకా మౌలిక వసతులకు నోచుకోని మారుమూల గిరి శిఖర గ్రామాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటి మరుగున పడిన గ్రామాల్లో ఒకటైన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 'గూడెం' ఒకటి. అలాంటి గ్రామంలో విద్యుత్ బల్బు వెలుగు వారిలో కొత్త ఆనందాన్ని ఇచ్చింది. తొలిసారిగా విద్యుత్ వెలుగు చూసిన జనం సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ తీసుకున్న చొరవ కారణంగా అతి తక్కువ కాలంలోనే ఇది సాధ్యమైంది. ఇప్పుడు ఆ పల్లెలో 17 కుటుంబాల్లో చీకటి తొలగిపోయింది. కార్తీక పౌర్ణమి పవిత్ర దినాన బయట వెన్నెల కాంతులు, గూడెం ప్రజల ఇళ్లలో విద్యుత్ కాంతులు ప్రకాశించాయి.
17 ఆవాసాలకు విద్యుత్ ఇవ్వడం కోసం 9.6 కిలోమీటర్ల మేర అడవులు, కొండ ప్రాంతాల గుండా విద్యుత్ లైన్లను వేయాల్సి ఉంటుంది. ఈ క్లిష్టమైన ప్రాజెక్టుకు సుమారు రూ.80 లక్షలకుపైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ అధిక వ్యయం, భౌగోళిక అడ్డంకుల దృష్ట్యా, పవన్ కల్యాణ్.. విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికి, ఏపీ జెన్కో సీఎండీలకు సమస్యను తెలియజేశారు. అవసరమైతే తక్షణం కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ చేసిన సూచన మేరకు, భారత ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా గిరిజన గ్రామంలో విద్యుత్ శాఖ వెలుగులు నింపింది. కేంద్ర ప్రభుత్వ నిధులు, విద్యుత్ శాఖ సాయంతో పనులు పూర్తయ్యాయి.