PAWAN: జాతీయ భావంతో ఆలోచించాలి: పవన్‌కల్యాణ్
కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం
కర్ణాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపొద్దని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సూచించారు. కన్నడ సినిమా ‘కాంతార చాప్టర్ 1’ టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఈ చిత్ర టికెట్ ధరల పెంపుపై చర్చ జరిగినట్టు పవన్ తెలిపారు. తాను హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమాకి కర్ణాటకలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుగు సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకొచ్చాయి. ఈ సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగించే చర్యలకు దిగుతున్నారని తెలిపాయి. దీనిపై పవన్ స్పందించారు. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలని పవన్ అన్నారు. కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్ నుంచి కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని వెల్లడించారు. సోదరభావంతో ఉన్నామని.. మన సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందులపై రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ చర్చించుకోవాలని పవన్ తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని వెల్లడించారు.
డిప్యూటీ సీఎం కోలుకోవాలని....
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ శ్రేణులు అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కట్టి పూజలు చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి త్వరగా ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని వారు కోరారు.
నేడు ఢిల్లీకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నం హస్తినకు వెళ్లనున్నారు. అనంతరం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. తిరిగి సాయంత్రం 5 గం.లకు సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని బడా పారిశ్రామికవేత్తల సమక్షంలో పెట్టుబడుపై ప్రసంగించనున్నారు. ఏపీలో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.