SANKRANTHI: సంక్రాంతికి పోలీసుల ముందస్తు ప్రణాళికలు
సంక్రాంతికి భారీగా స్వగ్రామాలకు నగరవాసులు.. హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా వాహనాలు... టోల్‌గేట్లు, ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు
సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో రహదారులపై ప్రయాణికుల రద్దీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వాహనాలు ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా భారీ సంఖ్యలో ప్రయాణించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారులపై జరుగుతున్న వంతెనల నిర్మాణాలు, టోల్ గేట్ల వద్ద వాహనాల నిలుపుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా ప్రణాళికలు రూపొందించారు. సంక్రాంతి ముందు, పండుగ రోజులు, పండుగ అనంతరం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ట్రాఫిక్ డైవర్షన్లు, నిఘా చర్యలు అమలు చేయాలని సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారులు నిర్ణయించారు. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను గుర్తించి ప్రత్యామ్నాయ దారులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద దారి మళ్లించనున్నారు. అక్కడి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, పిగుడురాళ్ల మీదుగా గుంటూరు వైపు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ మార్గం ద్వారా వాహనాలు సజావుగా ప్రయాణించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలకు కూడా ప్రత్యేక మార్గాలను సూచించారు. నకిరేకల్ మీదుగా అర్వపల్లి, మరిపెడ బంగ్లా, ఖమ్మం మీదుగా వాహనాలను మళ్లిస్తారు. ఈ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే, టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాజమండ్రి దిశగా వాహనాలను పంపే ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్–విజయవాడ రహదారిపై ఇప్పటివరకు అమలులో ఉన్న టేకుమట్ల డైవర్షన్‌ను తొలగించనున్నారు. గతంలో టేకుమట్ల వద్ద యూ-టర్న్ తీసుకుని తిరిగి సూర్యాపేట వైపు రావాల్సి ఉండేది. అయితే, ప్రస్తుతం జాతీయ రహదారిపై నేరుగా వాహనాలు వెళ్లేలా తాత్కాలిక రహదారిని నిర్మించారు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు కూడా కొత్త ప్రణాళికలు రూపొందించారు. గతంలో రాయినిగూడెం వైపు వెళ్లి యూ-టర్న్ తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు చివ్వెంల, ఐలాపురం వద్ద దారి మళ్లించి సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే ఏర్పాట్లు చేశారు.
ఈ ఏడాది ట్రాఫిక్ నియంత్రణలో ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎక్కడైనా వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోయినట్లు గుర్తిస్తే వెంటనే అక్కడికి సిబ్బందిని పంపి సమస్యను పరిష్కరిస్తారు. సూర్యాపేట గ్రామీణం, సూర్యాపేట, మునగాల, కోదాడ, కోదాడ గ్రామీణ సీఐల ఆధ్వర్యంలో పండుగకు ముందు రోజుల నుంచే, పండుగ అనంతరం ఐదు రోజుల వరకు సిబ్బంది నిరంతరం ట్రాఫిక్ పర్యవేక్షణ చేపట్టనున్నారు. హైవే పెట్రోలింగ్ వాహనాలు నాలుగు రౌండ్లు గస్తీ నిర్వహించనున్నాయి.