వైద్యవ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్ల నుంచి ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం వరకు కార్యాచరణ అమలు చేయాలన్నారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు ప్రజలకు భరించలేని ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ భారం తగ్గాలంటే ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లను కొనసాగిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని, పురుగు మందులు లేని ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ దిశగా రైతులు, ప్రజలను చైతన్యం చేయాలని, ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరం లేకున్నా సిజేరియన్లు చేయడం సరికాదన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఉండాలనే ప్రభుత్వ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి వైద్య సేవలు అందించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.