Konaseema District: కోనసీమ అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. జిల్లా పేరును మార్చొద్దంటూ..

Konaseema District: కోనసీమ జిల్లా అమలాపురంలో అగ్గిరాజుకుంది.. ఆ ప్రాంతమంతా అట్టుడికింది.

Update: 2022-05-24 12:55 GMT

Konaseema District: కోనసీమ జిల్లా అమలాపురంలో అగ్గిరాజుకుంది.. ఆ ప్రాంతమంతా అట్టుడికింది. కోనసీమ జిల్లా పేరును మార్చొద్దంటూ ఆందోళనకారులు తీవ్ర విధ్వంసానికి పాల్పడ్డారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వీరిని పోలీసులు చెదరగొట్టే క్రమంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆందోళనకారులు పలు వాహనాలు ధ్వంసం చేశారు. రెండు ఆర్టీసీ బస్సులతో పాటు ఓ ప్రైవేట్ బస్సుకు నిప్పు పెట్టారు.

కోనసీమ జిల్లా పేరును యధావిధిగా కొనసాగించాలంటూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు అంటూ యువకుల నినాదాలు చేశారు. ఐతే వీరి పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఎస్పీ, డీఎస్పీ గన్‌మెన్లకు గాయాలయ్యాయి. పోలీసు జీప్‌ను కూడా ధ్వంసం చేశారు.

కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు వాహనాలను అడ్డుపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలను ఆందోళనకారులు ముట్టడించడంతో.. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువురు ఆందోళనకారులతో పాటు పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వ నిర్ణయించడంతో.. వారం రోజులుగా కోనసీమ జిల్లాలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

అటు.. కోనసీమ జిల్లా పేరు మార్పుపై పునరాలోచన ఉండదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పేరు మార్పుపై అందర్నీ ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారాయన. కోనసీమ ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదు అన్నారు హోంమంత్రి. తన ఇంటిని తగులబెట్టడం దురదృష్టకరమని మంత్రి విశ్వరూప్ అన్నారు. జిల్లా పేరు మార్పుపై అభ్యంతరాలు చెబితే పరిశీలిస్తామని చెప్పారు.

Tags:    

Similar News