perni nani: చీకట్లో చంపేసి.. పొద్దున్నే పరామర్శకు వెళ్లాలి
వైసీపీ నేత పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. కన్ను సైగ చేస్తే లేపేయాలంటూ సూచన... మరింత బరితెగించి నేతలకు నాని పిలుపు;
రప్పా రప్పా అని నరుకుతామని అరవడం కాదని, కనుసైగతోనే పని అయిపోవాలంటూ వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కృష్ణాజిల్లాలో వైకాపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనం అధికారంలోకి వచ్చాక.. ఇప్పుడు తప్పులు చేసిన వాళ్లను నరికేద్దామంటూ కార్యకర్తల్ని రెచ్చగొట్టారు. కూటమి నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటామంటూ పరోక్షంగా హెచ్చరించారు.
మరీ ఇంత బరితెగింపా..?
పేర్ని నాని వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని టీడీపీ నేతల్ని చంపాలని పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులపై హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను "చీకట్లో కన్ను కొట్టి చంపేయాలని" కార్యకర్తలకు సూచిస్తున్నారు. "చీకట్లో కన్ను కొట్టి చంపేయాలి .. ఉదయమే వెళ్లి ఏమీ తెలియనట్లుగా పరామర్శించాలని" సూచించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. "అరే ఎన్నిసార్లు"రప్పా రప్పా నరికేస్తాం అని అరవటం కాదు.. చీకట్లో మొత్తం అయిపోవాలి.. తరువాత వెళ్లి ఎలా జరిగింది, ఏంటి అని పరామర్శించాలి..." అని పేర్ని నాని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు
పేర్ని నాని గతంలో కూడా టీడీపీ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలు వైరల్ కావడంతో, టీడీపీ మద్దతుదారులు ఆయనను "నీచమైన రాజకీయాలు" చేస్తున్నారని విమర్శించారు. వివేకానందరెడ్డిని హత్య చేసినట్లే అందర్నీ చంపాలని సలహాలిస్తున్నారని టీడీపీ మండిపడింది. టిడిపి కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తల మధ్య కొట్టుకు చచ్చేంత వైరం ఎందుకని.. వాళ్ల మధ్య ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హింసకు ప్రేరేపిస్తున్న పేర్ని నాని అరెస్టు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రిగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని పెంచే విధంగా కాకుండా.. హింసకు ప్రేరేపించేవిధంగా మాట్లాడటం దారుణమన్నారు. కృష్ణా జిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయి. పామర్రు, అవనిగడ్డ నియోజక వర్గాల్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక, ముల్లును ముళ్ళుతోనే తీయాలన్నారు పేర్ని నాని.. అంతే తప్ప పదే పదే రప్పా రప్పా అని వేలంవెర్రిగా మాట్లాడకూడదని కార్యకర్తలకు చెప్పారు.
పేర్నినానికి పోలీసులు షాక్
మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పేర్ని నాని వ్యాఖ్యలపై ఆర్ పేట పోలీసులకు ఇప్పటికే టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పామర్రులో నాని చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదుకు జిల్లా ఎస్పీ గంగాధర్ ఆదేశాలు ఇవ్వనున్నారు. మరోవైపు, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కారు ధ్వంసంపై కూడా గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ధ్వంసంపై ఇప్పటికే పోలీసులకి ఉప్పాల హారిక, ఆమె భర్త రాము ఫిర్యాదు చేశారు. మాజీమంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.