పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర భేటీ

Update: 2020-10-27 05:56 GMT

పోలవరం ప్రాజెక్టు అథారిటీ మరోసారి భేటీ కానుంది. నవంబరు 2న హైదరాబాద్‌లోని అథారిటీ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరగనుంది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ పెట్టిన షరతులే ప్రధాన ఎజెండగా... ఈ అత్యవసర సమావేశంలో చర్చించనున్నారు. 2014 ఏప్రిల్‌ ఒకటి నాటికి సంబంధించిన వ్యయం అంచనాల ప్రకారమే ధరలు చెల్లిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అందుకు గానూ... సవరించిన అంచనాలను ఆమోదించి పంపాలని కేంద్ర జల్‌ శక్తిశాఖకు.. కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. దీని ప్రకారం 20 వేల 398 కోట్లకు సవరించిన అంచనాలను కేంద్ర జల్‌శక్తి అమోదించే అవకాశం కనిపిస్తోంది.

అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అయ్యర్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి కేంద్ర జల్‌శక్తిశాఖ సంయుక్త కార్యదర్శి జగ్‌మోహన్‌ గుప్తా సైతం హాజరవుతారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ హాజరు కానున్నారు. అయితే తమ వాదనను గట్టిగా వినిపించేందుకు ఏపీ జల వనరులశాఖ సన్నద్ధమవుతోంది. ఏపీ రాష్ట్ర ప్రజంటేషన్‌ సైతం ఉండబోతోందని ఆయా అధికార వర్గాలు చెబుతున్నాయి.

అయితే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాదన. కేంద్రం తరఫున పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు చేపట్టిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గతంలో ప్రాజెక్టు నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం ఎంత ఖర్చు అవుతుందో పరిశీలించి ఆమోదించిన ప్రాజెక్టు అథారిటీ... కేంద్ర జలసంఘానికి సిఫార్సు చేసింది. అయితే ఇప్పుడు దానికి 2014 వ్యయం అంచనాల ప్రకారం 20 వేల 398 కోట్లను మాత్రమే ఎలా ఆమోదిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. 2017-18 ధరలకు అనుగుణంగా 55 వేల కోట్లు కావాలని వాదించనుంది.

తాజా పరిణామాలపై పోలవరం అథారిటీ అధికారుల్లోనూ అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కేంద్ర ఆర్థికశాఖ విధించిన షరతు ఆమోదించి పంపాలనేది కేంద్ర జలశక్తి మంత్రి నుంచి వచ్చిన లేఖ సారాంశం. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత అథారిటీదే. కేంద్రం తాజా షరతు ప్రకారం నిధులిస్తే ప్రాజెక్టు పూర్తి చేయడమూ సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోనే పోలవరం అథారిటీ ఉంది. ఈ పరిస్థితుల్లో తాము ఏ నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపాలనే విషయమై అథారిటీ పెద్దలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మార్గదర్శకం మేరకే అథారిటీ అడుగులు ఉండొచ్చని.. అత్యవసర సమావేశంలో అంచనాలను ఆమోదించే అవకాశం ఉంది. 

Tags:    

Similar News